ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కానీ ప్రధానమంత్రితో ఆయన అపాయింట్మెంట్ మాత్రం సందిగ్ధంలో పడింది. ఎప్పటి నుండో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు ఆరో తేదీన సమయం కేటాయిస్తున్నట్లుగా సీఎంవోలకు.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ మేరకు వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తీరిక చేసుకుని ఒక రోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన కీలకమైన విషయాలను చర్చించేందుకు పది మంది బృందంతో జగన్ ఢిల్లీకి వెళ్లారు. అయన అలా ఢిల్లీకి బయలుదేరగానే.. ఇలా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సందేశం అందింది.
ఖచ్చితంగా సమయం కేటాయిస్తామని చెప్పలేమని… మోదీకి అంత కంటే ముఖ్యమైన సమావేశాలున్నాయని ఆ సందేశం సారాంశం. అయితే ఢిల్లీ పర్యటన కోసం జగన్ అంతా సిద్ధం చేసుకున్నారు. తన మామ గంగిరెడ్డి చనిపోవడంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్… మధ్యాహ్నానికి తాడేపల్లి వచ్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. మంగళవారం కుదిరితే ఆయన ప్రధానితో భేటీ అవుతారు. లేకపోతే.. ఢిల్లీకి వెళ్లిన ఉద్దేశం దెబ్బతినకుండా… అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొంటారు. నిజానికి అపెక్స్ కౌన్సిల్ భేటీ వర్చువల్గా జరుగుతుంది. తెలంగాణ సీఎం కూడా ఢిల్లీకి వెళ్లట్లేదు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచే ఆయన వర్చవల్ భేటీలో పాల్గొని జల వివాదాలపై తన వాదన వినిపిస్తారు.
ఎలాగూ ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి..జగన్ ప్రత్యక్షంగా సమావేశంలో పాల్గొంటారని చెబుతున్నారు. ప్రధానితో భేటీ అవ్వాలని చాలా కాలంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సమయం దొరికినట్లే దొరికి చేజారిపోయింది. ఒక వేళ రేపు కుదరకపోతే..నెలాఖరులో మరోసారి అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.