ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యాలయాలు, ఇళ్లపై జరిగిన దాడులను సమర్థించారు. తనను అభిమానించే వారు.. ఆప్యాయత చూపే వారికి బీపీ వచ్చిన కారణంగా వచ్చిన రియాక్షన్‌గా ఆయన తేల్చారు. రికార్డెడ్ స్టేట్మెంట్ను మీడియాకు విడుదల చేశారు. అందులో దాడులు చేయడం శాంతిభద్రతలకు విఘాతం అని సీఎం ఏ రకంగానూ అనుకోలేదు. పైగా దాడులను సమర్థించారు.
ఎవరూ మాట్లాడని ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన బూతులు మాట్లాడి టీడీపీ నేతలు రెచ్చగొట్టారన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా అన్యాయమైన మాటలు మాట్లాడలేదన్నారు. తనను బూతులు తిట్టడం టీవీల్లో చూసిన అభిమానించే వాళ్లు.. ప్రేమించే వాళ్లు.. బీపీ వచ్చి.. రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఆ రకంగా వైషమ్యాలు క్రియేట్ చేసి రాజకీయంగా లబ్దిపొందాలనే ఆరాటం రాష్ట్రంలో కనిపిస్తూ ఉందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు జరిగిన తర్వాత ప్రెస్‌మీట్ నిర్వహించి తమకు సంబందం లేదని.. తమ పార్టీ వారు కాదని ప్రకటించారు. టీడీపీ వాళ్లే దాడి చేసుకుని ఉంటారని హోంమంత్రి సుచరిత ప్రకటించారు. అయితే సీఎం జగన్ మాత్రం .. తమను బూతులు తిట్టినందున అభిమానించే వాళ్లే బీపీ వచ్చి దాడి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ .. దాడులను సమర్థించడంపై ఏపీ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది.