అధికారంలో ఉన్న పార్టీ గ్రాఫ్ పడిపోతోందని తేలిన తర్వాత ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే విపక్ష పార్టీకి అంత బలం. ఎందుకంటే ఓ సారి పడిపోతున్న పార్టీని మళ్లీ నిలబెట్టడం అనేది జరగదు. దిద్దుబాటు చర్యలు మైనస్ అవుతాయి. ఇప్పటిదాకా తప్పులు చేసినట్లుగా ఒప్పుకున్నట్లవుతుంది. అందుకే సీఎం జగన్ వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుననట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక పరిస్థితులు అక్టోబర్, నవంబర్ నాటికి తీవ్రంగా మారిపోతాయి. ఈ ఏడాది అప్పుల పరిమితి మొత్తాన్ని మూడు, నాలుగు నెలల్లో వాడేసుకుని… పంచాల్సినదంతా పంచేసి ఎన్నికలకు వెళ్తే.. సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అసంతృప్తి ఉండదని నమ్ముతున్నారు. గతంలోనే అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణతో పాటు జరగాలని కోరుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా వచ్చినా … దానికి తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అనుకూలమైన పోలీసు అధికారులందర్నీ కీలక స్థానాల్లో నియమించేసింది.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. ఎన్నికల సన్నాహాలు మాత్రం ఆపలేదు. మరో ఏడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆర్థిక సమస్యలే కాకుండా పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరిగితే పరిస్థితులు మారిపోతాయని.. అంచనా వేస్తున్నారు. అందుకే అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఇది మాత్రం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారు.