అత్యవసర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన మోడీతో పాటు అమిత్ షా అపాయింట్మెంట్లను కోరారు. ఖరారు అయిన వెంటనే ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మోడీ, అమిత్ షాలతో చర్చించాలనుకుంటున్న అత్యవసర అంశాలేమిటన్నదానిపై స్పష్టత లేదు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. రాత్రి పూట.. అధికార సమావేశాలు కాకుండా వ్యక్తిగత మీటింగ్లు జరిపే సమయంలో సమావేశాలు జరిపి వస్తూంటారు. రాత్రి పది గంటల తర్వాత మీటింగ్లు ఎక్కువగా జరుగుతూంటాయి.
లోపల ఏం చర్చిస్తారో అధికారికంగా ప్రకటనలు విడుదల చేయడం తక్కువ. జగన్ మీడియాలో అత్యధికం వస్తాయి. అయితే ఎప్పుడు సమావేశం అయినా రొటీన్లో అన్నీ ఒకే అంశాలను ప్రస్తావించినట్లుగా చెబుతూంటారు. ప్రత్యేకహోదా, విభజన సమస్యలు, పోలవరం నిధులు, మూడు రాజధానులు, కర్నూలుకు హైకోర్టు తరలింపు ఇలా జాబితా పెద్దగానే ఉంటుంది. ఎన్ని సార్లు సమావేశమైన ఈ అంశాలపై స్పష్టత మాత్రం రాదు. విపక్షాలు మాత్రం జగన్ వెళ్లేది వ్యక్తిగత కేసుల నుంచి రక్షించమని కాళ్లపై పడేందుకేనని ఆరోపిస్తూ ఉంటాయి.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రంపై పోరాడి.. సాధించాలి కానీ.. శాలువాలు కప్పి వినతి పత్రాలతో సరి పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏ ఎజెండాతో వెళ్తున్నారో అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రాష్ట్రం కోసమే జగన్ వెళ్తారని సహజంగానే చెబుతూంటారు. ఆయన భేటీ వివరాలు.. అసలు ఎప్పుడూ బయటకు రాలేదు. వారు విడుదల చేసే ప్రెస్నోటే అంతిమం. ఈ సారి కూడా అంతే అయ్యే అవకాశం ఉంది.