ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచినప్పటి నుండి ఆయన ఢిల్లీ ఎప్పుడు వెళ్తారా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయనకు అపాయింట్ మెంట్ లభించడంతో ఢిల్లీ పయనమవుతున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారన్న సమాచారం రావడంతో ఒక రోజు ముందుగానే ఢిల్లీ వెళ్తున్నారు .
నిజానికి రేపు అంటే శుక్రవారం ఆయన ఫీజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యా దీవెన పథకం మీట నొక్కాల్సి ఉంది. ఇందు కోసం సభ ఏర్పాట్లు చేశారు. అయితే సభా ప్రాంగణం పక్కనే స్కూల్ ఉందని… పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అసౌకర్యం అన్న కారణం చెప్పి ఒక రోజు వాయిదా వేశారు. కానీ అసలు కారణం మాత్రం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఉండటమేనని స్పష్టమయింది. చాలా రోజుల నుంచి సీఎం జగన్ ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతున్నారు. కానీ ఇప్పటికి లభించడంతో హుటాహుటిన వెళ్తున్నారు.
కారణం ఏదైనా కొంత కాలం నుంచి కేంద్రం మద్దతు కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అప్పుల పరిమితి ఏమైనా తగ్గిస్తే ఏపీ ప్రభుత్వానికి కాళ్లూ చేతులూ ఆడవు. ఈ ఏడాది ఖర్చులు కూడా వచ్చే ఏడాదికి మారిపోయాయి. అప్పుల పరిమితి ఖరారు చేసే విధానం వల్ల.. ఈ సారి ఏపీ అప్పుల పరిమితి చాలా తక్కువగా ఉంటుందన్న అంచనాలుఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనంత వృద్ధి ఏపీలో ఉందని లెక్కలు ప్రకటించారు. వాటిని చూపించి అదనపు అప్పుల కోసం అడిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివేకా హత్య కేసులో సీబీఐ చాలా దూకుడుగా ఉంది. కేసు జగన్ వద్దకు వస్తోందని సజ్జల లాంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అంతర్గతంగా చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.