నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను నివర్ ప్రభావం కనిపించింది. చెన్నైలా గాలులు చుట్టుముట్టకపోయినా .. ఎంత వర్షం పడితే.. నష్టం జరుగుతుందో.. అంత వర్షం పడింది. ముందస్తుగా చర్యలు కూడా లేకపోవడంతో.. ఎటూ తప్పించుకోవడానికిలేకుండా పోయింది. అదే సమయంలో కడప లాంటి నగరం నాలుగు అడుగుల నీరు లోతులో మునిగిపోయిది. అక్కడా కొన్ని వేల మంది నష్టపోయారు. వీరందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసి.. తిరుపతిలో సమీక్ష చేస్తారు.ఈ సందర్భంగా ఎవరూ ఊహించనంత పరిహారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎవరికైనా నష్టపరిహారం ప్రకటనలో జగన్మోహన్ రెడ్డిస్టైల్ వేరే ఉంటుంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు.. మృతులకు యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తే.. ఆయన వెళ్లి ఏకంగా కోటి రూపాయలు ప్రకటించారు. దటీజ్ జగన్ అనిపించారు. ఇప్పుడు రైతులకు కూడా అదే తరహాసాయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎకరానికి కనీసం ఇరవై వేలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వారిని కూడా షాక్ కు గురి చేసేలా సాయం ప్రకటించనున్నారని అంటున్నారు.
అలాగే కడప నగర వాసులకు జగన్ ప్రత్యేక సాయం ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ ఇంటికి రూ. పదివేలు చొప్పున ప్రకటించారు. అప్పటికప్పుడు పంపిణీ కూడా చేశారు. ఇంకా చాలా మందికి పెండింగ్ ఉంది. ఈలోపు ఎన్నికలొచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కడపలో ఎన్నికల మూడ్ కూడా ఉంది కాబట్టి.. ఇంటికి పదివేలు పంచినా రాజకీయ ప్రయోజనం కూడా ఉంటుందన్న చర్చ వైసీపీలో ఉంది. ఎంత ఇస్తారు.. అనేదానిపై క్లారిటీ లేకపోయినా.. సాయం విషయంలో మాత్రం ప్రతిపక్షాల డిమాండ్లకు విలువ లేకుండా చేస్తారన్న చర్చ మాత్రం జరుగుతోంది.