ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్న తర్వాత తనను దూరం పెట్టడం.. తనకు వ్యతిరేకంగా ఇతరుల్ని ప్రోత్సహించడం.. బలాన్ని నిరూపించుకోవాలని కొత్త ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి అవమానించడంతో ఇటీవల ఆయన తాను నియోజకవర్గ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లుగా లేఖ రాశారు. ఆ తర్వాత జగన్ చెప్పారని చెప్పి ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆయన ఇంటికి జగన్ వెళ్లారు.
విశాఖలో పరిశ్రమల శంకుస్థాపనల కోసం వచ్చిన జగన్.. ఆ తర్వాత వాసుపల్లి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయనకు కాస్త భరోసా ఇచ్చినట్లయింది. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందా లేకపోతే.. మొత్తానికే మోసపోతానా అని కంగారు పడుతున్న వాసుపల్లికి.. జగన్ .. భరోసా ఇచ్చినట్లయింది. జగన్ వాసుపల్లి ఇంటికే వెళ్లడంతో ఆయనకు టిక్కెట్ ఖరారయినట్లేనని.. నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారంతా ఇక సర్దుకోవచ్చని ప్రచారం ప్రారంభించారు.
అయితే విశాఖ జిల్లాలో పార్టీని నమ్ముకుని చాలా మంది ఉన్నప్పటికీ వారెవరినీ పట్టించుకోకుండా.. ఫిరాయింపు ఎమ్మెల్యేను బుజ్జగించడానికి జగన్ ప్రయత్నించడం.. మిగిలిన నేతలకు పెద్దగా రుచించలేదు. అయితే ఎవరూ నోరెత్తలేని పరిస్థితి. ఇప్పుడు వాసుపల్లి.. విశాఖ ఇంచార్జ్‌గా ఉన్న వైవవీ సుబ్బారెడ్డిని కూడా లెక్క చేయకుండా.. తన పని తాను చేసుకోవచ్చని అనుకుంటున్నారు.