జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సమయంలో.. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను.. సత్కరించుకోవడం సముచితమని జగన్ లేఖలో పేర్కొన్నారు. 1947 జూలై 22న పింగళి రూపొందించిన పతాకానికి.. ఆమోదం తెలిపారని.. ఇప్పటి వరకూ పింగళి వెంకయ్యకు సరైన గుర్తింపు రాలేదని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనలు 2009లో ఒకసారి 2011లో ఒక సారి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. అయితే ఇంత వరకూ ఆ ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకోలేదు.
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఘనంగా నిర్వహించాలనుకుంటున్న కేంద్రం… వచ్చే ఏడాదికి కొంత మంది గుర్తింపు నోచుకోని స్వాతంత్ర్య సమరయోధులకు భారతరత్న ప్రకటించే చాన్స్ ఉందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ కారణంగా సీఎం జగన్ లేఖతో.. పింగళి అంశాన్ని కేంద్రం పరిశీలనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 2022 ఆగస్టు పదిహేనో తేదీ వరకూ ఇవి జరుగుతాయి. ప్రతీ వారం… కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
75 వారాల పాటు నిర్వహించి.. 75వ వారం… 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా…ప్రధాని మోదీ ఇప్పటికే ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ సూచనల మేరకు కార్యక్రమాలు సాగుతున్నాయి. అంతకు ముందు సీఎం జగన్… మాచర్లలో ఉన్న పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని .. ఇంటికి వెళ్లి సత్కరించారు. రూ.75 లక్షల చెక్ అందించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జరిగే కార్యక్రమాలకు.. రావాలని పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు సీఎం ఆహ్వానం పలికారు.