ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. చివరికి, మంత్రి వర్గంలో కూడా చాలామందికి సీఎం నిర్ణయాలు అంత ఈజీగా అర్థం కావు! ఇంకా చెప్పాలంటే… ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాల సమాచారం మంత్రులకే తెలియని పరిస్థితులు కూడా ఉంటాయని తాజాగా అర్థమౌతోంది. మామూలుగా అయితే, పరిపాలనాపరంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారు…? మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి, అక్కడే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం… ఒక కీలక నిర్ణయం విషయంలో కొంతమంది మంత్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ అంటూ తాజాగా కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నదాతకి ఎంతో మేలు చేసే కీలక నిర్ణయం ఇది. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమల్లో ఉన్నట్టు లేదు. ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లో లేరనే చెప్పడంలో సందేహం లేదు. అయితే, ఇలాంటి నిర్ణయాలు ప్రకటించేముందు ఎంతో మేధోమథనం జరుగుతుందని అనుకుంటాం. మంత్రి వర్గంలో ఎన్నో చర్చోపచర్చలు జరిగిన తరువాత తుదిరూపు దాల్చుతుందని భావిస్తాం. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయం మంత్రి వర్గంలోనే సగం మందికి తెలియక పోవడం విడ్డూరం.
అవును.. ఈ నిర్ణయం గురించి కొంతమంది మంత్రులకు ఎలాంటి సమాచారం లేదట! కేసీఆర్ ప్రకటించగానే కొంతమంది మీడియా ప్రతినిధులు ఓ మంత్రిని స్పందన కోరితే.. తనకు ఆ విషయం ఇంకా తెలియదని సదరు ఆమాత్యవర్యులు బదులిచ్చారట! ఇంకొకరైతే… టీవీలో వార్తలు వస్తున్నప్పుడే ఈ విషయం తనకు తెలిసిందని వాపోయారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేముందు… ఒక మాటగానైనీ తమకు చెబితే బాగుండేదనీ, జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేవాళ్లం కదా అంటూ కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సో.. ఇక్కడ మరోసారి అర్థమౌతున్నది ఏంటంటే, తానే సుప్రీమ్ అనే విషయాన్ని కేసీఆర్ చాటి చెప్పకున్నట్టు. పార్టీ మీదా నాయకుల మీదా కేడర్ మీదా తన పట్టు సడలకుండా ఉండాలంటే… ఇలాంటి సంచలనాలు ఎప్పటికప్పుడు ఉంటూ ఉండాలనేది కేసీఆర్ కి తెలియంది కాదు కదా! కాబట్టి, ఇది కూడా వ్యూహాత్మక నిర్ణయమే