పోలవరం ప్రాజెక్ట్ రీడిజైన్ జరుగుతోందా…? తెలంగాణలో ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేసిన… తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఇది జరుగుతోందా..? అవుననే అంటున్నారు… తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్లే… ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని… ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. తాను జగన్ కు సూచించానని.. దానికి ఆయన అంగీకరించారని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మహారాష్ట్రతో తాము జల వివాదాలు పరిష్కరించుకున్నట్లుగానే పరిష్కరించుకోవాలని జగన్ కు సలహా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నారు.
ఉమ్మడి ప్రాజెక్టు విషయంపై.. జరిపిన చర్చల సమయంలోనే… దీనిపై చర్చించి ఉంటారని.. ఈ మేరకు.. జగన్ పోలవరం ఎత్తు తగ్గించేందుకు అంగీకరించి ఉంటారని.. అదే విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని భావిస్తున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. అన్ని రకాల ప్రక్రియలు పూర్తయిపోయాయి. 71 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది. అయినప్పటికీ.. ఇప్పుడు.. తెలంగాణ సీఎం సూచనతో.. ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించడం సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. అది జాతీయప్రాజెక్టు. కేంద్రమే నిర్మిస్తోంది. ఆ ప్రాజెక్టు బాధ్యత కూడా కేంద్రానిదే. కేవలం నిర్మాణ నిర్వహణ బాధ్యతలు మాత్రమే ఏపీ సర్కార్ చూస్తోంది.
అలాంటిది.. ఎవరికి.. ఎలాంటి సమాచారం.. చర్చలు…పరిణామాలపై ఆలోచనే చేయకుండా… పోలవరం ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించారని కేసీఆర్ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కొద్ది రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఉంటున్నాయి. రివర్స్ టెండరింగ్ కానీ… కాంట్రాక్టర్ల తొలగింపు కానీ.. కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక కానీ… అన్నీ న్యాయవివాదాల్లో ఇరుక్కుపోయేలా చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో… కేసీఆర్ అసెంబ్లీలో.. పోలవరం ఎత్తు తగ్గింపు ప్రకటన… సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.