ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించడానికి సంకోచిస్తున్నరేమో కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా చంద్రబాబుపై చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈరోజు సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తెరాస నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని వదల బొమ్మాళీ నిన్ను వదల అంటున్నాడు..నాకు తెలియక అడుగుతున్నాను..ఆయనని హైదరాబాద్ వదిలిపెట్టి పొమ్మని ఎవరు అన్నారు…రావొద్దని ఎవరు అన్నారు. ఆయనకి హైదరాబాద్ అంటే అంతగా ఇష్టమయితే మరో పదిపదిహేను హెరిటేజ్ దుఖాణాలు పెట్టుకోమను…వాటికి అనుమతులు కావాలా..ఏమి కావాలో చెప్పండి అన్ని ఇస్తాం…ఇక్కడ మా వదిన భువనేశ్వరి చాలా చక్కగానే వాటిని నిర్వహిస్తోంది…కావాలంటే చంద్రబాబు నాయుడు వారానికోసారి వచ్చి వాటి జమాపద్దులు చూసుకొని వెళ్లిపోవచ్చును.”
“ఆయన ఇప్పుడు విజయవాడ పోయి ఉంటున్నాడు. ఆయనకి ఇక్కడి సంగతులు, పరిస్థితులు ఏమీ తెలియవు. మా వదినమ్మ భువనేశ్వరికి వాటి గురించి బాగా తెలుసు. అందుకే మొన్న మా టిఆర్ఎస్స్ కార్యకర్తలు ఆమెను కలిసినపుడు ఆమె కూడా మా పార్టీకే ఓటు వేస్తానని చెప్పారు. ఆమె తప్పకుండా మా పార్టీకే ఓటేస్తారని మాకు తెలుసు. ప్రజలు నన్ను తెలంగాణా చూసుకోమన్నారు..ఆయనని ఆంద్రా చూసుకోమన్నారు…అక్కడ చేయడానికి చాలా పనులున్నాయి..ఆయన ముందు వాటిని చక్కబెట్టకుండా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కి అది చేస్తాను..ఇది చేస్తాను..అని చెపుతుంటాడు”
“నేను అమరావతికి పోయి అక్కడ పనులు చక్కబెడతానంటే జనాలు ఊరుకొంటారా? పోనీ ముంబైకి వెళ్లి హడావుడి చేస్తానంటే అక్కడి జనాలు ఊరుకొంటారా? ఎవరి పని వాళ్ళు చక్కబెట్టుకోవాలి గాని వేరోళ్ళ పనిలో వేలు పెట్టకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వదల అంటాడు…మళ్ళీ విజయవాడ వెళ్ళగానే హైదరాబాద్ లో ఉంటే పరాయి దేశంలో ఉన్నట్లుగా ఉంటుందని అంటాడు.. హైదరాబాద్ ని పరాయిదేశం..వీసాలు పాస్ పోర్టులు అని అంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయనకేమి పనో నాకు అర్ధం కాదు…మా హైదరాబాద్ ని ఎలాగా అభివృద్ధి చేసుకోవాలో మేము చూసుకొంటాము…దాని గురించి నువ్వు ఆలోచించనవసరం లేదు..నువ్వు చెప్పే మాయమాటలు నమ్మడానికి తెలంగాణా ప్రజలు సిద్దంగా లేరని తెలుసుకో..అక్కడ ప్రజలు నీకు అప్పజెప్పిన పనిని చక్కగా చేసుకో చాలు,” అని కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి తను చెప్పదలచుకొన్నదంతా చాలా నిష్కర్షగా చెప్పేశారు.
ఆయన మాటలలో చంద్రబాబు నాయుడు పట్ల ఎంత చులకన భావం ఉందో చాలా స్పష్టంగా కనబడుతోంది. కనుక చంద్రబాబు కూడా ఆయనతో స్నేహం చేయాలనే భ్రమలో నుండి త్వరలోనే బయటపడవచ్చును. తెలంగాణాలో తన పార్టీకి మరే ఇతర పార్టీ నుంచి పోటీ ఉండకూడదనే తన అభిప్రాయానికి కేసీఆర్ తన మాటల మాయాజాలంతో చాలా అందమయిన ముసుగు తొడిగి, తన మనసులో మాటలని ప్రజల మనసులకి హత్తుకుపోయేలా చాలా లౌక్యంగా చెపుతున్నారు.
“చంద్రబాబు నాయుడుని ఎవరు పొమ్మన్నారు అని అంటూనే ఆయనకి ఇక్కడ ఏమి పని?” అడుగుతున్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలోనయినా ఏర్పాటు చేసుకోవచ్చును. నడిపించుకోవచ్చును ఎన్నికలలో పోటీ చేయవచ్చుననే విషయాన్ని కేసీఆర్ అంగీకరించడం లేదని ఆయన మాటలతో స్పష్టం అవుతోంది. ఆయనకే కనుక అధికారం ఉంటే తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని రాజ్యాంగ సంస్థలకు ఎన్నికలను రద్దు చేసేసి, తన పార్టీ మాత్రమే శాస్వితంగా ప్రభుత్వం నడిపేలా చట్టం తీసుకురాగలరని చెప్పవచ్చును. కానీ అది సాధ్యం కాదు కనుక, ఆపరేషన్ ఆకర్షతో ప్రతిపక్ష పార్టీలని అన్నిటినీ బలహీనపరుస్తూ, క్రమంగా వాటిని తెలంగాణా నుండి తుడిచిపెట్టేయాలని ఆయన ప్రయత్నిస్తుండటం గమనించవచ్చును. చంద్రబాబు నాయుడు బీజేపీతో చేతులు కలిపి నేటికీ తెలంగాణాలో తన పార్టీకి సవాలు విసురుతున్నందునే కేసీఆర్ ఆయనపై ఈవిధంగా అక్కసు వెళ్లగక్కుతున్నారని చెప్పవచ్చును. కాకపోతే ఆ అక్కసుకు తన వాక్చాతుర్యంతో చాలా అందమయిన ముసుగు వేస్తున్నారు అంతే!