నల్గొండ ప్రజలకు, యాదాద్రి (యాదగిరి గుట్ట)కి వెళ్ళే భక్తులకు ఒక శుభవార్త. హైదరాబాద్ కే పరిమితమయిన మెట్రో రైల్ ని నల్గొండలోని యాదాద్రి వరకు పొడిగించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించుకొంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత యదాద్రిని తిరుపతి సమానంగా అభివృద్ధి చేయాలని సంకల్పించుకొన్నారు. యదాద్రి అభివృద్ధి కోసం గత ఆర్ధిక సంవత్సరం నుంచి ఏడాదికి రూ.100 కోట్లు చొప్పున బడ్జెట్ లో కేటాయిస్తానని హామీ ఇచ్చేరు. హామీ ఇవ్వడమే గత ఏడాది బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించి శరవేగంగా యదాద్రి పుణ్యక్షేత్రం దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించారు. యాద్రాద్రి పుణ్యక్షేత్రానికి కొత్త సొబగులు అద్దడంతో ఇప్పుడు భక్తుల తాకిడి కూడా గణనీయంగా పెరిగింది.
యదాద్రి హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడికి చేరుకోవాలంటే సరయియన్ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆర్టీసి బస్సులు, రైళ్ళలో చేరుకోవలసి వస్తోంది. అందుకే హైదరాబాద్ మెట్రో రైల్ ని నల్గొండలోని యదాద్రి సమీపంలో గల రాయగిరి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశ్చయించుకొన్నారు.
అందుకోసం తక్షణమే సర్వే చేపట్టామని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న ఎల్.&టి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డిని ఆదేశించడంతో ఆయన నిన్న భోన్గిర్ (భువనగిరి) ఎంపి బూర నరసింహయ్య గౌడ్ తో కలిసి యదాద్రి వచ్చేరు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తక్షణమే సర్వే మొదలుపెట్టి స్వల్పకాల, దీర్ఘకాల నివేదికలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యయం, దానిపై వచ్చే రాబడి, లాభం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు, కష్టనష్టాలను సర్వే చేసి తెలుసుకొన్న తరువాత, ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కి సమర్పిస్తారు. ఈ సర్వే పూర్తవడానికి బహుశః ఒకటి లేదా రెండు నెలలు పైనే పట్టవచ్చును. ఆ సర్వే నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారు. ఒకవేళ యదాద్రి వరకు మెట్రో రైల్ ఏర్పాటు చేసినట్లయితే ఇక హైదరాబాద్ నుంచి భక్తులు, ప్రయాణికులు చాలా వేగంగా, సౌకర్యవంతంగా వెళ్లిరావచ్చును.