తెలంగాణ ఏర్పడి తాను అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కసారి కూడా జెఎసి చైర్మన్ కోదండరాంతో వివరంగా మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగొచ్చు గాని నిజం. జెఎసి కేంద్ర బిందువుగా కోదండరాంను ముందుంచి ఉద్యమం నడిపిన కెసిఆర్ దాన్ని మరీ సమరశీలం కానివ్వడం ఎప్పుడూ ఇష్టం లేదట. దాంతో పగ్గాలు వేసి వుంచడానికే ప్రయత్నించేవారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరి సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి. తను గాక మరో చైర్మన్ వుండటం కెసిఆర్‌కు నచ్చలేదన్నది స్పష్టమే. జెఎసిని రద్దు చేయాలని ఎన్నిసార్లు సంకేతాలు ఇచ్చినా కోదండ ఒప్పుకోలేదు. రాష్ట్ర సాధన తర్వాత కూడా వాచ్‌డాగ్‌లాగా కొనసాగాలన్నది ఆయన ఆలోచన. రాజ్యసభకు పంపడంతో సహా చాలా ప్రతిపాదనలు తోసిపుచ్చారు. ఆ విధంగా పదవులు తీసుకుని సుఖపడదామనుకున్న మేధావులు నాయకులు అనేకమంది ప్రభుత్వ వ్యవస్థలో భాగమై పోయారు. సమస్యలపై తమ విధానం ప్రభుత్వానికి చెప్పాలని జెఎసి ప్రయత్నించినా ప్రతిస్పందన రాలేదట. కెసిఆర్ మాత్రమే గాక మంత్రులు కూడా కొందరు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. దాంతో ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సారి ఏ రాజకీయ పార్టీతో కలసి వ్యవహరించాలనుకోవడం లేదు. ఎవరినీ దూరం పెట్టరు కూడా. తామే స్వంతంగా పార్టీగా ఏర్పడాలా వద్దా అనే దానిపై ఇంకా సంధిగ్ధత వుంది. ఆప్‌తో సహా చర్యలు జరిపివెళ్లాయి గాని నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగానే తాము వేరే జెఎసి ఏర్పాటు చేస్తున్నట్టు జస్టిస్ చంద్రకుమార్ ప్రకటించారు. కొంతమంది జెఎసి నుంచి తప్పుకున్నారు. అయినా సరే ఉన్నవారితో కలసి ముందుకు పోవాలనే కోదండరాం భావిస్తున్నారు. తను ఎవరికో ఏజంటునన్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు గాని ఎవరితోనైనా చర్చలు జరిపే సమస్యలపై కార్యాచరణ జరిపే అవకాశం అట్టిపెట్టుకుంటున్నారు. కొత్తపార్టీ ఏర్పాటుపై కూడా తుది వాక్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. టిజెఎసిలో దీనిపై పెద్ద కసరత్తే జరుగుతున్నది. ఇది ఏ రూపం తీసుకునేది ముందు ముందు గాని తేలద