జి.హెచ్.ఎం.సి.ఎన్నికల ప్రక్రియను 45రోజుల నుండి 15రోజులకు కుదిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ.పై హైకోర్టు ఈరోజు స్టే విధించడంతో ప్రతిపక్షాలు దానిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తూ చాలా హడావుడి చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలని అయోమయంలో ఉంచి, హటాత్తుగా ఎన్నికలకి వెళ్లి విజయం సాధించాలని తెరాస వేసిన ఎత్తు బెడిసికొట్టడంతో దానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది.
ఈ పరిస్థితిని మంచి అవకాశంగా తీసుకొని ప్రతిపక్షాలు ప్రజలను ఆకట్టుకొన్నట్లయితే, ఏడాది కాలంగా ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం తెరాస ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే దీనికి తరుణోపాయంగా ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో తమకు న్యాయస్థానం అంటే చాలా గౌరవం ఉందని, కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద గల మూడు లక్షల మంది ఉద్యోగులలో ఈ ఎన్నికల నిర్వహణకు కనీసం లక్ష మంది ఏకధాటిగా నెలరోజుల పాటు పనిచేయవలసి ఉంటుంది. దాని వలన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి. ఆర్ధికంగా చాలా భారం అవుతుంది. అందుకే ఎన్నికల ప్రక్రియను రెండు వారాలకు కుదించాము తప్ప ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదని తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకొనే వెసులుబాటు ఉంది కనుక, జి.హెచ్.ఎం.సి.లో ఉన్న 150 డివిజన్లకి రిజర్వేషన్లను అందుకు తగ్గటుగా తమ పార్టీ అభ్యర్ధులను కూడా ఖరారు చేసుకొనే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడే ముందు రోజు రాత్రి డివిజన్ల వారిగా రిజర్వేషన్లను ప్రకటించినట్లయితే తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన తాజా జీ.ఓ. ప్రకారం నామినేషన్లు వేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. అంత తక్కువ సమయంలో ప్రతిపక్షాలు తమ అభ్యర్ధులనే ఖరారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. హడావుడిగా ఎవరో ఒకరిని నిలబెట్టక తప్పని పరిస్థితి ఏర్పడితే, ఆ స్థానాలలో తెరాస తరపున ముందే నిర్ణయించుకొన్న బలమయిన అభ్యర్ధులు నిలబడతారు. కనుక తెరాస అవలీలగా విజయం సాధించగలదని ఈ వ్యూహం వేసినట్లు స్పష్టం అవుతోంది.
కానీ దానిపై ప్రతిపక్షాలు హైకోర్టుకి వెళ్ళవచ్చని, వెళితే కోర్టు దానిపై స్టే ఇవ్వవచ్చునని తెరాస ఎందుకు ఆలోచించలేకపోయిందో తెలియదు. అది వేసిన ఈ ఎత్తు హైకోర్టు స్టే విదించడంతో బెడిసికొట్టింది. సరిగ్గా ఎన్నికలకు ముందు హైకోర్టు చేత ఈవిధంగా మొట్టికాయలు వేయించుకోవడం వలన కూడా తెరాసపై ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడేలా చేయవచ్చును. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రక్రియకు నెలరోజులు గడువు విధించడం వలన కూడా తెరాసకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత హడావుడిగా పత్రికా ప్రకటన జారీ చేసినట్లు భావించవలసి ఉంటుంది.
తమ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తోందని తెరాసకు పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ప్రతీ ఎన్నికలని మరీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటూ ఏదో యుద్ధానికి సిద్దమవుతున్నట్లు ప్రణాళికలు, వ్యూహాలు రచించుకోవడం దేనికో తెలియదు. వాటి వలన తెరాసకి ఎన్నికలలో లాభం కలగుతున్నప్పటికీ, తెరాసకు ఆత్మవిశ్వాసం లోపించి అభద్రతాభావంతో బాధపడుతొందనే సంకేతం కూడా ఇస్తోంది. అలాగే ప్రభుత్వానికి అటార్నీ జనరల్, అనేకమంది న్యాయ నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రతీసారి ఏదో ఒక జీ.ఓ.జారీ చేయడం, ఆనక దానిపై హైకోర్టు స్టే విధించడం, అప్పుడు ఈవిధంగా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకొని బాధపడటం ఎందుకో అర్ధం కాదు. ప్రభుత్వానికి ఇది చాలా అవమానకరమయిన విషయమే కదా!