రాష్ట్ర బడ్జెట్ వేరే ఉంటుంది, ఇక్కడి పద్దులు ఇక్కడే ఉంటాయి. కేంద్ర కేటాయింపులు వేరే ఉంటాయి, వాటి లెక్కలూ వేరుంటాయి. ఒక రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని తమ ప్రణాళికల ఫలితమే అని అధికార పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే, వైఫల్యాలు దగ్గరకి వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో బాధ్యత వహించాలి కదా! కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటున్నారంటే… కేంద్రం వల్లనే తమ ప్లానింగ్ అంతా తారుమారైంది అంటున్నారు! కేంద్ర బడ్జెట్ మీద ఆయన స్పందిస్తూ… రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అన్నారు. కేంద్ర పన్నుల వాటా తగ్గించేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం అన్నారు. దీంతో నిధుల కొరత ఏర్పడుతుందనీ, సంక్షేమ పథకాలు అమలు మరింత కష్టం అవుతుందన్నారు.
కేంద్రం అసమర్థత వల్లనే రాష్ట్రాల నిధుల్లో కోత పడిందన్నారు. దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే చర్యలేవీ బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదున్నారు. జీఎస్టీ అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ. 19 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంటే, రూ. 15 కోట్లు మాత్రమే వచ్చిందనీ, దాదాపు నాలుగు వందల కోట్ల కొరత ఏర్పడిందన్నారు. వాటాల ప్రకారం పన్నులు రాష్ట్రానికి ఇవ్వడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు. తాజా బడ్జెట్లో రాష్ట్రాల కోటా తగ్గించడం ద్వారా ప్రతీయేటా రూ. 2 వేల కోట్ల నిధులు తగ్గుతాయన్నారు. తగ్గించిన వాటా ప్రకారమైనా పూర్తి నిధులు ఇస్తుందో లేదో నమ్మకం లేదన్నారు. జీఎస్టీ విషయంలోనూ కేంద్రం ఇలానే మోసం చేసిందన్నారు. పట్టణాభివృద్ధి నిధుల్లోనూ కోత పెట్టారనీ, దీని ప్రభావం పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిపై పడుతుందన్నారు కేసీఆర్. సాగునీటి పారుదల ప్రాజెక్టులకు ప్రత్యేక సాయం అందలేదన్నారు.
కేసీఆర్ వాదన ఎలా ఉందీ అంటే… మొత్తంగా కేంద్ర బడ్జెట్ తోనే రాష్ట్రాలు నడుస్తున్నట్టు, కేంద్ర కేటాయింపులతోనే రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలు జరుగుతున్నట్టుగా ఉంది. కేంద్రం పన్నుల వాటా తగ్గించడం వల్ల కొంతవరకూ ప్రభావం ఉండటం నిజమే. కానీ, కేసీఆర్ చెప్పినంతగా అన్నీ ఆగిపోతాయనే పరిస్థితి ఎందుకు ఉంటుంది..? రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, దాన్లో సంక్షేమ పథకాలుగానీ, రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టులకుగానీ కేటాయింపులు యథావిధిగా ఉంటాయి కదా. సర్దుబాట్లు ఇక్కడ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు సందర్భం దొరికింది కదా అన్నట్టుగా… కేంద్రంపై మరోసారి తీవ్ర విమర్శలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది.