తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి నెలరోజులైంది. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్… మంత్రి వర్గ విస్తరణ గురించి ఇంతవరకూ స్పష్టమైన ప్రకటనలేవీ చేయడం లేదు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప… విస్తరణ ఎప్పుడు ఉంటుందనే సమాచారం తెరాస ఎమ్మెల్యేలకు కూడా స్పష్టత లేని పరిస్థితి. సీఎం పిలిస్తే వెళ్తున్నాం, అడిగిన సమాచారం ఇస్తున్నాం, అంతకుమించి తమకు ఎలాంటి సమాచారం తెలీడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఊహాగానాలు కూడా ఇప్పుడు లేకుండా పోయాయి! కానీ, 18వ తేదీన ఓ ఏడుగురికి మంత్రి పదవులు ఇచ్చి, ప్రమాణం చేయిస్తారనే కథనం ప్రస్తుతం మెల్లగా ప్రచారంలోకి వస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే వారితో ప్రమాణం చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, అలా ప్రమాణం చేయబోతున్నది ఎవరితో అనేది కూడా స్పష్టత లేని పరిస్థితి.
మంత్రి వర్గ కూర్పుపై కేసీఆర్ మౌనంగా ఉంటున్నారనీ అనుకోలేం, ఆయన కచ్చితంగా ఏదో ఒక వ్యూహంతోనే ఉంటారు. హరీష్ రావు, కేటీఆర్ లు లోక్ సభ ఎన్నికలు ముగిసేవరకూ పదవులు చేపట్టరు అనే క్లారిటీ దాదాపు వచ్చేసింది. ఎందుకంటే, పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లను కూడా గెలిపించే పనిలో వారిద్దరు నిమగ్నమై ఉండాలి కాబట్టి, పదవికి దూరంగా ఉండే అవకాశం ఉందనేది తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పాక్షికంగా కొందరికి పదవులు ఇచ్చి… పూర్తిస్థాయి విస్తరణను లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా వేస్తారేమో అనే చర్చ కూడా తెరాస వర్గాల్లో జరుగుతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలు క్రియాశీల పాత్ర పోషించి, తెరాస అభ్యర్థుల గెలుపునకు బాగా కృషి చేస్తే… అలాంటివారికి మంత్రి పదవి దక్కుతుందనే ఒక ప్రచారం పార్టీ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే, బాగా పనిచేస్తేనే పదవి అనే సంకేతాలు కేసీఆర్ ఇస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ముందే క్యాబినెట్ విస్తరణ జరిగిపోతే… పదవులు దక్కనివారు కొంత నిరాశ చెందుతారనీ, లోక్ సభ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయరనే అభిప్రాయం ఉన్నట్టుగా ఉంది. అంతేకాదు, మంత్రి పదవులు ఇచ్చేస్తే… ప్రోటోకాల్ అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి, ఎంపీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పార్టీపై దృష్టి పెట్టే సమయం కూడా నేతలకు కొంత తగ్గుతుందనే లెక్కలు కూడా ఉన్నట్టు సమాచారం! ఒకటైతే వాస్తవం… మంత్రి వర్గ విస్తరణ వెనక కేసీఆర్ వ్యూహాలు చాలా ఉన్నాయి. తన జాతీయ రాజకీయాలు, తనయుడి రాష్ట్ర రాజకీయాలు, రాబోయే ఎంపీ ఎన్నికలు… ఇవన్నీ క్యాబినెట్ కూర్పు ఆలస్యానికి కారణంగా చెప్పుకోవచ్చు.