వారసుడు కేటీఆర్‌కు.. కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగించారు. కరుణానిధి స్టాలిన్‌కు డీఎంకే బాధ్యతలు అప్పగించినట్లు… వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. అలా అప్పగించడమే కాదు.. పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టి… ఇక పార్టీలో ఏం జరగాలన్నా.. కేటీఆరే చూసుకుంటారని చెప్పేశారు. అంటే.. ఇక కేసీఆర్ కాదు… కేటీఆరే. కేసీఆర్ చూసుకునే వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అంతే కాదు.. కేటీఆర్‌కు మంత్రివర్గంలో అవకాశం లేదని హింట్ ఇచ్చారు. కారణం.. ఆరు నెలల్లో పార్టీపై పూర్తి పట్టు సాధించేలా… కేటీఆర్‌కు.. కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ లోపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఇప్పుడు పార్టీ పోస్ట్‌ను ఇచ్చినట్లే.. అప్పుడు.. సీఎం పోస్ట్‌ను కేసీఆర్ .. కుమారుడికి అప్పగించబోతున్నారు. ఈ విషయంపై ప్రగతి భవన్ నుంచి సూచనలు మీడియాకు అందుతున్నాయి.
కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ప్రకటించారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమీకరించి జాతీయ స్థాయిలో కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇదంతా.. కేటీఆర్‌ను సీఎం పదవికి చేరువ చేసేందుకేనని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. పంచాయతీ, స్థానిక సంస్థలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని కేటీఆర్ ముందుండి నడిపిస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్కు ఘన విజయాలు లభిస్తాయి. లోక్‌సభ ఎన్నికల వరకూ విజయాలు సాధించి… అనుకున్నట్లుగానే 16 స్థానాలను గెల్చుకోగానే.. కేటీఆర్ సమర్థతకు మెచ్చి… కేసీఆర్ సీఎం పీఠం అప్పగించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో మరింత బిజీ అవుతారు. ఐదారు నెలలపాటు కేటీఆర్ పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, ఎన్నికలకే పరిమితమవుతారు.
మొత్తానికి కేసీఆర్ .. ఓ పక్కా ప్రణాళికతో… కుమారుడికి పట్టాభిషేకం చేసే రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. దాన్ని అమలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా రాజకీయాల్లో ఇలా వారసుడికి పట్టం కట్టే ప్రక్రియ క్లిష్టమైనది. ప్రజల్లో ఎక్కువ శాతం… వ్యతిరేకతకు కారణం అవుతుంది. వరుసగా ఘన విజయాలు సాధిస్తున్నప్పుడు మాత్రమే యాక్సెప్టెన్సీ లభిస్తుంది. కేసీఆర్ ఇప్పుడు… ఆ విజయాలను సాధిస్తూ… కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి.. జనామోదం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. బహుశా…ఇప్పుడు మంత్రిగా కూడా చాన్స్ ఉండని కేటీఆర్ ఆరు నెలల తర్వాత ముఖ్యమంత్రిగా కనిపించడం ఖాయం కావొచ్చు. ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుంటే తప్ప..!