ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి, చంద్రబాబు, కేసీఆర్ ముఖ్యమంత్రులయిన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ఘర్షించుకొన్నాయో అందరూ చూసారు. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధిలో పోటీపడాలని చంద్రబాబు నాయుడు పదేపదే కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తుండేవారు కానీ కేసీఆర్ వాటిని పట్టించుకొనేవారు కాదు. నిత్యం ఏదో ఒక సమస్యని చూపిస్తూ చంద్రబాబు నాయుడుపై కత్తులు దూస్తూనే ఉండేవారు. ఓటుకి నోటు కేసుతో వారి మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. ఆశ్చర్యకరంగా అదే వారి మధ్య గొడవలకు ముగింపు కూడా పలికింది. చంద్రబాబు నాయుడు విజయవాడ తరలిపోవడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్రమంగా ఉద్రిక్తతలు తగ్గు ముఖం పట్టాయి. అదే సమయంలో తెలంగాణాలో తెదేపా తుడిచిపెట్టుకుపోవడం కూడా మొదలయింది. అయినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంతో కేసీఆర్ పూర్తిగా ‘కూల్’ అయినట్లున్నారు.
అందుకే ఇవ్వాళ్ళ శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వచ్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, ప్రభుత్వాలు సహకరించుకోవాలని, ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో మెలగాలని అన్నారు. అనవసరంగా గిల్లి కజ్జాలు పెట్టుకొంటే రెండు రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నివిధాల సహకరించేందుకు తన ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. దుమ్ముగూడెం దిగువకి పారే నీటిపై ఆంధ్రాకే హక్కు ఉందని అన్నారు. సముద్రంలో పోయే నీటిని ఒడిసిపట్టుకొని సమర్ధంగా వినియోగించుకొన్నట్లయితే ఇరు రాష్ట్రాలకి చాలా మేలు జరుగుతుందని అన్నారు.
గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేమాట చెపుతున్నారు. ఇన్నాళ్ళకు కేసీఆర్ కూడా అది గ్రహించి సహకరించుకోవడానికి సిద్దపడటం చాలా శుభపరిణామం. ఇకనయినా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయాలు, విభేదాలు పక్కనపెట్టి పరస్పరం సహకరించుకొంటూ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తే అందరూ హర్షిస్తారు.