ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్నట్టుగా ఈ మధ్యనే ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు! ఏదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నారన్నట్టుగా సంచలన ప్రకటనలు చేసి.. సవాల్ చేశారు. ఇదే సమయంలో, సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించడం, వారి పనితీరును తెలుసుకోవడంపై శ్రద్ధ పెట్టడంపై నాయకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి టిక్కెట్లు ఖాయమని ఇదివరకే చెప్పారు. కానీ, కండిషన్స్ అప్లై అన్నట్టుగా… పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తారనేది పార్టీలో తీవ్రంగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే రెండు సర్వేలు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా మరో సర్వే కూడా చేయించడం పూర్తయిందని సమాచారం.
తాజా సర్వేపై తెరాస ఎమ్మెల్యేల్లో బాగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, ఎన్నికల ముందు జరిగిన చివరి సర్వే ఇదేననీ, దీని ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుందనే చర్చ ఎమ్మెల్యేల్లో చాలా తీవ్రంగా ఉంది. కేవలం పనితీరు ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది కేసీఆర్ ఇదివరకే చెప్పడంతో, ఎన్నిక సమయంలో అసంతృప్తులకు తావు లేకుండా.. ఇప్పట్నుంచే పరిస్థితిని అదుపులోకి తేవడమే తాజా సర్వే లక్ష్యంగా తెలుస్తోంది. ఈ వారంలోనే సర్వే వివరాలు బహిర్గతం చేస్తారట. దీంతో ఎవరి టిక్కెట్లు దక్కవో అనేది దాదాపు ఒక స్పష్టత వచ్చేస్తుందనే ఆసక్తి తెరాస వర్గాల్లో నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు ప్రముఖ నేతలకు ఈసారి టిక్కెట్లు అనుమానమేననీ, అధికారులపై పెత్తనం చెలాయిస్తున్న ఇద్దరికి చెక్ ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ మధుసూదనాచారిపై కూడా ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. భూపాలపల్లిలో ఆయన కుమారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, సీఎం హెచ్చరించినా ఫలితం లేకపోయిందనీ వినిపిస్తోంది! దీంతో ఆయనకి మరోసారి టికెట్ అనుమానం అంటున్నారు. ఇలా జిల్లాలవారీగా కొంతమంది ప్రముఖల పనితీరుపై కూడా తాజా సర్వేలో ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయనే ఆసక్తి నెలకొంది.
గతంలో రెండు సర్వేలు నిర్వహించి.. పనితీరు బాగులేని ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్నారు. కాబట్టి, తాజా సర్వేలు సదరు నేతల పనితీరులో మార్పు కనిపించాలన్నది సీఎం ఆదేశం! ఒకవేళ మార్పు లేకుంటే తాను చేయగలిందేమీ లేదనే సంకేతాలు కూడా ఇస్తున్నారట. అంటే, టిక్కెట్లు రాకపోతే.. అది స్వయంక్రుతమని వారే ఫీలవ్వాలన్నమాట. సర్వే పత్రాలు చేతిలో పెట్టుకుని… ఇలాంటి లీకులు ఇస్తూ, ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపించి పనిచేసే విధంగా ప్రేరేపించడం కేసీఆర్ కి మాత్రమే చెల్లింది. మరోసారి టికెట్ దక్కాలంటే పనిచేసి తీరాలనే టెన్షన్ ను నేతలకి భలేగా పుట్టిస్తున్నారు. మొత్తానికి, తాజా సర్వే ఫలితాలను అభ్యర్థుల జాబితా అనే స్థాయిలో పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.