సాధారణంగా కొన్ని రాజకీయ లేదా ప్రభుత్వ వ్యవహారాలు కొన్ని అనవాయితీలకు కట్టుబడి ఒక మూస పద్దతిలో కొనసాగుతుంటాయి. వాటిలో రాష్ట్రపతి, గవర్నర్ ల ప్రసంగాలు కూడా ఒకటని చెప్పవచ్చును. రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగంతో చట్ట సభల సమావేశాలు మొదలవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాగే వారు అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానాలను తమ ప్రసంగంలో సభ్యులకు వివరించడం కూడా ఆనవాయితీగా పాటిస్తుంటారు. వారి ప్రసంగంపై సభలో చర్చ జరిగినప్పుడు, ప్రతిపక్షాలు దానిలో లోపాలను ఎట్టి చూపించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించి, వారి ప్రసంగంలో ఏమాత్రం పస లేదని తేల్చి చెప్పడం కూడా ఆనవాయితీగా సాగిపోతోంది.
తెలంగాణా శాసనసభ సమావేశాలలో కూడా ప్రస్తుతం అదే జరిగింది. ప్రతిపక్ష సభ్యులు యధాప్రకారం గవర్నర్ ప్రసంగంలో బొత్తిగా పస లేదని అది అచ్చం తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలాగ ఉందని ఎద్దేవా చేసారు. సాధారణంగా అటువంటప్పుడు అధికార పార్టీ సభ్యులు, మంత్రులు గట్టిగా తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అద్భుతంగా జవాబిచ్చారు. ఇంతవరకు గవర్నర్ ప్రసంగంపై ముసుగును నిర్భయంగా తొలగించి వేసారు.
ఆయన సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “నిజానికి గవర్నర్ ప్రసంగం మా ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రతిబింబించకపోతేనే తప్పుగా భావించాలి. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఏమేమీ చేస్తామని చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నామో లేదో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కనుకనే గవర్నర్ ప్రసంగం ద్వారా అవన్నీ సభలో ప్రజాప్రతినిధులకు సవివరంగా తెలియజేస్తున్నాము,” అని జవాబు చెప్పారు.
జాతీయ స్థాయిలో రాష్ట్రపతి పేరిట కేంద్రప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నట్లుగానే, రాష్ట్రాలలో గవర్నర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తుంటాయి. కనుకనే వారు తమ ప్రసంగాలలో “మా ప్రభుత్వం” అని సంభోదిస్తుంటారు. కనుక తమ అధీనంలో పని చేసే ప్రభుత్వాల విధివిధానాల గురించి, వాటి తీరు తెన్నుల గురించి తమ ప్రసంగాలలో వివరిస్తుంటారు. అదే న్యాయం కూడా.
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ గవర్నర్ క్రింద పనిచేస్తున్నాయి కనుకనే ఆయన ఆయా ప్రభుత్వాల విధివిధానాల గురించి, వాటి తీరు తెన్నులను తన ప్రసంగంలో వివరిస్తుంటారు. కానీ గవర్నర్ కూడా తమతో కలిసి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగించాలని బహుశః ప్రతిపక్షాలు ఆశిస్తున్నందునే, గవర్నర్ ప్రసంగంలో అధికార పార్టీ మ్యానిఫెస్టో కనిపించడం తప్పనే అపోహ చిరకాలంగా నెలకొని ఉంది. ఆ అపోహను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్భయంగా తొలగించారు. అందుకు ఆయనను మెచ్చుకోవలసిందే.