హైదరాబాద్: హైదరాబాద్‌లో అసెంబ్లీ భవనంవద్ద మెట్రో రైల్ మార్గానికి సంబంధించి మొదట ప్లాన్ చేసినట్లే నిర్మించటానికి కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. పురాతన వారసత్వ సంపదకు చెందిన అసెంబ్లీ భవనం శోభ మెట్రో రైల్ వలన దెబ్బ తింటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ముందునుంచి మెట్రో రైల్ మార్గం వెళ్ళటానికి అనుమతించబోమని గత ఏడాది తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ ప్రకటించారు. అలా అయితే అసెంబ్లీ భవనం వెనకనుంచి మార్గాన్ని నిర్మించటానికి అనుమతించాలంటూ ఎల్ అండ్ టీ కంపెనీవారు ప్రత్యామ్నాయ డిజైన్ రూపొందించి ఆరు నెలల కిందట తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించారు. మరి ఇప్పుడేమయిందో, ఏమోగానీ మొదటి డిజైన్ ప్రకారమే నిర్మాణం కొనసాగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఈ సంవత్సర కాలం జాప్యంవలన మెట్రో రైల్ నిర్మాణ వ్యయం కొన్ని కోట్లు పెరిగిపోయింది.
ఇది కేసీఆర్‌కు కొత్తకాదు. గత 17 నెలల్లో కేసీఆర్ తీసుకున్న అనేక యూటర్న్ నిర్ణయాలలో మెట్రో రైల్ ఒకటి. ఇప్పుడు ఉన్న సెక్రెటేరియట్ వాస్తు బాగోలేదని, ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ స్థలంలో కొత్త సెక్రెటేరియట్ నిర్మించాలని ఆయన నిర్ణయించారు. తదనుగుణంగా చెస్ట్ హాస్పిటల్‌ను వికారాబాద్‌కు తరలించటానికి జీవోకూడా విడుదల చేశారు. అయితే ఆ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, కోర్ట్ కేసులు, హెరిటేజ్ హోదా సమస్యల కారణంగా ప్రభుత్వం నూతన సెక్రెటేరియట్ భవనం నిర్ణయాన్ని విరమించుకోక తప్పలేదు. కొత్త సెక్రెటేరియట్ భవనంకోసం ప్రస్తుతం కేసీఆర్ కన్ను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ పైన పడిందంటున్నారు. గణేష్ నిమజ్జనంకోసం ఇందిరాపార్క్‌లో వినాయక్ సాగర్ పేరుతో ఒక సరస్సును నిర్మించాలనికూడా కేసీఆర్ నిర్ణయించి మనసు మార్చుకోవాల్సివచ్చింది. ఆ పార్క్‌కు వెళ్ళే రహదారులు ఎంత ఇరుకుగా ఉంటాయి, వందలాది వాహనాలు అక్కడకు ఎలా వెళతాయి, ఇందిరాపార్క్ ధ్వంసం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేసీఆర్ నిర్ణయం తీసుకోవటంపైకూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీవారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో ఈ నిర్ణయంకూడా వెనక్కు మళ్ళింది.
అఫ్జల్ గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను పడగొట్టి అదే స్థలంలో కొత్త ఆసుపత్రి నిర్మించాలన్న నిర్ణయంకూడా ఈ కోవలోకే వస్తుంది. దీనిపై ఉవ్వెత్తున నిరసనలు చెలరేగటంతో ప్రభుత్వం మళ్ళీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. చీప్ లిక్కర్‌పైన నిర్ణయానికికూడా కేసీఆర్ ప్రభుత్వం ఇదే స్పందన ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఈ నిర్ణయంపై మండిపడ్డాయి. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేయటంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్నికూడా బుట్టదాఖలు చేయక తప్పలేదు.
ఇలా నిర్ణయాలు తీసుకోవటం వలన కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. దీనివలన ప్రభుత్వ ఖజానాపై, పరోక్షంగా ప్రజలపై భారం పడుతుంది. కేసీఆర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు అధ్యయనం చేయకపోవటం, తన మంత్రివర్గ సహచరులనుగానీ, విభిన్న వర్గాలనుగానీ సంప్రదించకపోవటం దీనంతటికీ కారణం. ఇకనైనా కేసీఆర్ తన ఆలోచనా ధోరణి మార్చుకుంటే ఆయన ఇమేజ్ మెరుగుపడుతుంది.