ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గోదావరి, కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దానికి సంబంధించిన చర్చలు త్వరలోనే ఒక కొలీక్కి రాబోతున్నాయన్నారు. శ్రీశైలం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా, దక్షిణ నల్గొండ ప్రాంతం.. నాగార్జున సాగర్ ద్వారా నల్గొండ, ప్రస్తుత వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నారు. రెండు రాష్ట్రాలు చేస్తున్న ఈ ప్రతిపాదనలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుత్సిత బుద్ధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకి ఏ గుణమో ఇతరులకీ అదే ఉందని అనుకుంటారని ఎద్దేవా చేశారు.
గతంలో ఇదే చంద్రబాబు నాయుడు బాబ్లీ మీద గొడవకి వెళ్లి సాధించిందేం లేదన్నారు. పరవాడ ప్రాజెక్టు మీద గొడవకి వెళ్లి ఏం సాధించలేదన్నారు. ఎక్కడ ప్రాజెక్ట్ అంటే అక్కడ కోర్టుకి వెళ్లడం, హంగామా చేయడం, ఆగమాగం చేయడం తప్ప ఆయన చేసింది గుండు సున్న అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో తాము మాట్లాడి వచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామన్నారు. రేప్పొద్దున కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవాలనుకున్నప్పుడు దానికి తగు రీతిలో అగ్రిమెంట్లు చేసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నామన్నారు. గత పాలకుల అసమర్థ విధానాలు, తెలివి తక్కువ విధానాల వల్ల రాష్ట్రంలో కరవు ఇంకా ఉందన్నారు.
కృష్ణా గోదావరి జిలాలు రెండు జలాలు కలిసి వాడుకోవడాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించలేదు కదా! తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన కంటే… ముందుగా రాయలసీమకు నీటి అవసరాల గురించి ఆలోచించాలన్నారు. అవసరమైతే సాగర్ నీటిని మనమే లిఫ్ట్ చేయ్యొచ్చన్నారు. మన నీటిని మనం పూర్తిగా వాడుకున్నాక, మిగులు జలాలు ఇద్దామన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టు లక్షా యాభైవేల కోట్లు అంటున్నారనీ, మనవి ఎనిమిది వాళ్లవి నాలుగు జిల్లాలు అంటున్నారన్నారు. నదీ జలాల వినియోగంపై ఏ రాష్ట్రాల హక్కులు ఆ రాష్ట్రాలకి ఉండాలనీ, ఉమ్మడి హక్కులుంటే భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం ఉంటుందనీ, కేసీఆర్ జగన్ లు ఇక్కడ శాశ్వతం కాదనీ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాన్ని ఆయన విమర్శించింది లేదు. ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని మాత్రమే చెప్పారు. అలాంటప్పుడు చంద్రబాబు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు కేసీఆర్ ఎలా చేస్తున్నట్టు..?