హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో అపర చాణుక్యుడు, వ్యూహప్రతివ్యూహాలలో దిట్టగా పేరుగాంచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను చిన్న అల్లం ముక్క ఖంగుతినిపించింది. ముఖ్యమంత్రి తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాల పంటలు పండిస్తూ ఎకరానికి కోటి రూపాయలు కూడా సంపాదించానని గతంలో ఒక సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే అలాంటి పెద్ద రైతుకు ఇప్పుడు పెద్ద నష్టమే వచ్చింది. భారీ ఎత్తున సాగుచేసిన అల్లంపంటకు సరైన గిట్టుబాటు ధర రాక కోత కోయకుండా పొలంలోనే అలానే ఉంచేశారు కేసీఆర్.
సీఎమ్ అల్లం సాగును మొదటిసారిగా గత జూన్ నెలలో ప్రారంభించారు. అప్పట్లో అల్లం ధర మార్కెట్లో కిలోకు రు.150 నుంచి రు.200 వరకు పలికింది. ఆ ఉత్సాహంతో కేసీఆర్ ఒకేసారి 50 ఎకరాలలో సాగు మొదలుపెట్టారు. ఎకరానికి దాదాపు రు.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. సాధారణంగా ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ కేసీఆర్ అత్యాధునిక పద్ధతిలో సాగు చేయటంతో 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. అయితే రేటు రు.35కు పడిపోయింది.
ఈ అల్లంపంటను ఎలాగైనా మంచి రేటుకు అమ్మటానికి తెలంగాణ ఉద్యానవన శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారట. వ్యాపారులను ఒప్పించి కనీసం కిలోకు రు.100 వచ్చేలా ప్రయత్నిస్తున్నారట. అయితే 50 ఎకరాలలోని పంటను ఒకేసారి కొనటానికి ఏ వ్యాపారీ ముందుకు రావటంలేదని చెబుతున్నారు.
ఉల్లిపంట పరిస్థితి కూడా ఇప్పుడు ఇదేవిధంగా ఉంది. ఆ మధ్య కిలో రు.100 దాకా వెళ్ళిన ఉల్లి ప్రస్తుతం రు.3కు పడిపోయింది. దీంతో మహారాష్ట్ర ఉల్లి రైతులు కొందరు హైదరాబాద్కు తీసుకొచ్చిన పంటను ఇక్కడే మార్కెట్లో వదిలేసి వెళ్ళిన పరిస్థితి కూడా మీడియాలో వచ్చింది.
మరి కేసీఆర్ ఇప్పుడేమి చేస్తారో వేచి చూడాలి. రాష్ట్రమంతటా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ పిట్టల్లా రాలిపోతుంటే, ఒక్కరివద్దకు కూడా చూడటానికి వెళ్ళని ముఖ్యమంత్రికి ఇప్పటికైనా వారి సమస్యల తీవ్రత అర్థమై ఉండాలి.