“2009వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను ఆదిలాబాద్ లోని ఒక తాండ కి వెళ్లాను. అక్కడ కంటి చూపు లేని ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది. ఆమెకు కనుగుడ్లు బొత్తిగా లేవు. కానీ ఆమె కళ్ళలో నుండి నీరు వస్తోంది. ఆమెను మీకు ఏం కావాలి అని నేను అడిగాను. ఆమె పెద్ద పెద్ద కోరికలు ఏమి కోర లేదు. మా ప్రాంతానికి మంచినీళ్లు లేవయ్యా మంచినీళ్లు ఇప్పించండి అని అడిగింది. 70 ఏళ్ల స్వాతంత్రం లో ఇప్పటికీ ప్రజలు మంచి నీటిని ఇప్పించండి అని ప్రభుత్వాలను నాయకులను ప్రాధేయ పడడం నన్ను కలచివేసింది. అక్కడ నాతోపాటు ఉన్న నాయకులు కొంతమంది, మన ప్రభుత్వం వచ్చాక మంచినీరు ఇప్పిస్తామని ఆవిడకు హామీ ఇవ్వమని నాతో చెప్పారు. కానీ నాకు మనసు ఒప్పలేదు. ఆవిడ అడుగుతోంది ఒక తక్షణ అవసరం. మంచినీళ్లు తక్షణం ఇప్పించండి అని ఆమె అడుగుతుంటే, ప్రభుత్వం వచ్చాక ఇస్తాం అంటూ ఆమెను మిగతా నాయకుల్లాగా మభ్య పెట్టడం ఇష్టం లేక, మనసంతా చెడిపోయి ప్రచారం నుండి ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత అదే ప్రాంతానికి మర్నాడు ప్రచారానికి వెళ్లినప్పుడు నాకు ఎవరో ఒక మినరల్ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చారు. ఆ ప్రాంతం లో కూర్చొని ఆ బాటిల్ లోని నీళ్లు తాగడానికి నాకు మనస్కరించలేదు. ఆ మినరల్ వాటర్ బాటిల్ లో నీళ్లు నేను తాగలేక పోయాను. ఆ ప్రాంతానికి నీళ్లు ఇప్పించడానికి ఏదైనా మార్గం ఉందేమోనని తెలిసినవాళ్లని కనుక్కున్నాను. డబ్బు మొత్తం నేను పెట్టుకుంటాను ఏదో ఒకటి చేసి ఆ ప్రాంతానికి నీళ్లు ఇప్పించండి అని కొంత మందిని అడిగాను. తర్వాత ఒక బోర్ వేయించి ఆ ప్రాంతానికి నీళ్లు తెప్పించాము. అప్పటికి కానీ నా మనసు కుదుట పడలేదు. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. అలాంటి వ్యక్తి గా నేను తలచుకుంటేనే ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయగలిగినప్పుడు, ఒక ఎమ్మెల్యే తలచుకుంటే, లేదా ఒక ఎంపీ తలచుకుంటే, లేదా ఒక ప్రభుత్వం తలచుకుంటే, ఒక వ్యవస్థ తలచుకుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చు అని అనిపించింది. ఆరోజు ప్రజలకు మేలు చేయగలిగే, వారి తక్షణ కనీస అవసరాలు తీర్చగలిగే ఒక స్థానంలో నన్ను ఉంచమని దేవుడు ని ప్రార్థించాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది అలాంటి ప్రజల అవసరాలు తీర్చడానికే కానీ డబ్బులు సంపాదించుకోవడానికో, పేరు సంపాదించుకోవడానికో కాదు. అందుకే ముఖ్యమంత్రి పదవి అన్నది నాకు ఒక బాధ్యతే తప్పించి అది నాకు అలంకారం కాదు” – ఇవీ ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు.
జనసేన ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రి లో పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎప్పటి లాగానే ప్రజలు లక్షలాదిగా వచ్చారు. ఎప్పటిలాగానే చాలా ఛానళ్లు ఈ సభ లైవ్ ఇవ్వడం మాట అటుంచి, కనీసం చిన్న స్క్రోలింగ్ కూడా ఇవ్వకుండా వారి కి నచ్చిన ఇతర ప్రోగ్రామ్స్ వేసుకున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈరోజు నిర్వహించిన బహిరంగ సభ ఎప్పటిలాగానే దిగ్విజయం అయ్యింది. ఈరోజు సభలో ఎంతో బ్యాలెన్స్డ్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మొత్తం తన ఉపన్యాసాన్ని మూడు అంశాలమీద కేంద్రీకరిస్తూ ఇచ్చారు. మొదటిది తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించిన అంశాలు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న సమస్యలు వంటి వాటి మీద అయితే, రెండవది జనసేన మేనిఫెస్టో లోని ముఖ్య అంశాలను వివరించడం గురించి. ఇక మూడవ అంశం రాజకీయ ఉపన్యాసం. చంద్రబాబు జగన్ లతో పాటు మోదీని కెసిఆర్ ని టార్గెట్ గా చేసుకుని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
టీచర్ ఉద్యోగం తో సహా అన్ని ఉద్యోగాలకు ఒక ట్రైనింగ్ అంటూ ఉంటుందని కానీ రాజకీయ నాయకులకు మాత్రం కేవలం డబ్బు ఉంటే చాలు రాజకీయాలు చేయవచ్చు అన్న అభిప్రాయం ఉంటుంది అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, జనసేన డబ్బుతో రాజకీయాలు చేయదు అని వ్యాఖ్యానించారు. తాను పార్టీని నిర్మించే క్రమంలో ఒకానొక సమయంలో ఒక ప్రచారానికి వెళ్లాల్సి ఉండగా డబ్బు లేకుండానే ప్రచారానికి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. డబ్బు లేకపోయినా, తనకు గోదావరి జిల్లాల్లో తప్ప ఎక్కడా ఓట్లు రావని కొంతమంది విమర్శించిన, నీ పార్టీ వెనకాల ఉన్నది కేవలం యువత మాత్రమేనని మిగతా వర్గాలు లేరు అని కొందరు నిరుత్సాహపరిచినా అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఈరోజు అయిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జనసేన పార్టీ జరుపుకుంటోంది అంటే దానికి కారణం మీరే అంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగబరితమైన ప్రసంగం చేశారు.
మొత్తం మీద నిజాయితీగా ఉంది అనిపించేలా కొనసాగిన పవన్ కళ్యాణ్ ఉపన్యాసం అభిమానులనే కాకుండా ఇటు తటస్థులని కూడా ఆకట్టుకునేలా కొనసాగింది.