ఏపిలో వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఆకర్షించడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తిగా ఇటీవల వార్తలలోకి ఎక్కినా తెదేపా రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్ తెదేపా వ్యూహం ఏమిటో బయటపెట్టేశారు. ఆయన ఒక ఇంగ్లీష్ పత్రికకి ఈ విషయం చెప్పినట్లు సమాచారం. త్వరలో జరుగబోయే రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో రాష్ట్రంలో వైకాపాకున్న ఒకే ఒక్క సీటు కూడా దక్కనీయమని ఆయన చెప్పారు.
వైకాపాకి ఉన్న 67మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోవడంతో ప్రస్తుతం ఆ పార్టీకి ఇంకా 62 మంది ఎమ్మెల్యేలున్నారు. వారి సంఖ్య 36 కంటే తక్కువకి పడిపోతే రాజ్యసభకి తమ పార్టీ తరపున రాజ్యసభాకి సభ్యుడిని పంపలేరని సి.ఎం. రమేష్ చెప్పారు. కనుక మరో 26మంది వైకాపా ఎమ్మెల్యేలని లాగేసుకొంటామని ఆయన చెపుతున్నట్లు భావించవచ్చును.
ఒకేసారి అంతమంది ఎమ్మెల్యేలని తెదేపాలోకి రప్పించడం సాధ్యమా కాదా.. సాధ్యమయితే వారి రాకతో తెదేపాలో చిచ్చు రగలకుండా ఉంటుందా లేదా.. అనే సందేహాలను పక్కన పెడితే, సి.ఎం. రమేష్ ఈవిధంగా మాట్లాడటం సబబా కాదా, కాకపోతే ఎందుకు మాట్లాడారనే ముందు ఆలోచించవలసి ఉంటుంది.
“తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బయపెట్టి తెదేపా నేతలు ఫిరాయింపులకి ప్రోత్సహిస్తున్నారని” వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే, వారి ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ గట్టిగా ఖండిస్తున్నారు. తమకు ఇతర పార్టీలవారిని తమ పార్టీలో చేరమని బలవంతం చేయవలసిన అవసరమేమీ తమకు లేదని, రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసే వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారని చెప్పుకొంటున్నారు. కానీ నిజమేమిటో అందరికీ తెలుసు. ఆ నిజాన్ని సి.ఎం. రమేష్ ఈవిధంగా బయటపెట్టుకోవడం వలన వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమేనని దృవీకరించినట్లయింది.
రాష్ట్రంలో తెదేపా బలంగా ఉన్నప్పుడు ఈవిధంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం దేనికో తెలియదు. బహుశః తెలంగాణాలో తెరాసను ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ ప్రేరణతోనే ఈ పనికి పూనుకొంటున్నారేమో? ఈ విషయంలో తెలంగాణాలో తెరాసను తప్పు పడుతున్న తెదేపా కూడా అదే తప్పు చేస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు ఉండకూడదనే ఆలోచనే చాలా తప్పు. అటువంటి ఆలోచనలు ఎప్పుడూ, ఎక్కడా ఫలించలేదు. పైగా అవి ఏదో ఒకరోజు బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వంటి అపార రాజకీయ అనుభవజ్ఞుడు కూడా ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారో? దాని దుష్ఫలితాలను ఊహించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.