ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంత్రివర్గాన్ని బుధవారం సాయంత్రం విస్తరించనున్నారు. ఎవరెవరికి చోటు దక్కనుందో.. ఓ క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. అయితే.. ఎక్కువగా ప్రముఖుల పేర్లు మాత్రమే ప్రచారం అవుతున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దొరుకుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. కేబినెట్ పదవి కాకపోయినా సహాయ మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. దేశంలో కేంద్రమంత్రివర్గంలో చోటు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఆ లోటు తీర్చాలని మోడీ డిసైడయినట్లుగా చెబుతున్నారు. ఇంతకు ముందు దాదాపుగా ఇరవై ఐదు వరకూ ఖాళీలు కేంద్రమంత్రివర్గంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు.. ఇద్దరు, ముగ్గుర్ని తప్పించి.. దాదాపుగా ఇరవై మందిని చేర్చుకుంటున్నారు కాబట్టి.. ఖచ్చితంగా ఏపీకి ఓ బెర్త్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే ఏపీ నుంచి బీజేపీకి నేరుగా ఎంపీలు లేరు. కానీ టీడీపీ నుంచి గెలిచి బీజేపీలో విలీనమైన ఎంపీలు ఉన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ , టీజీ వెంకటేష్ ఉన్నారు. ఇస్తే గిస్తే వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. సుజనా చౌదరి టీడీపీ హయాంలో మంత్రిగా చేశారు.
బీజేపీలో చేరిన మొదట్లో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేశారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా సీఎం రమేష్ పేరు పరిశీలనలోకి వచ్చింది. సీఎం రమేష్ పేరే ఎక్కువగా ఢిల్లీ సర్కిళ్లలో వినిపిస్తోంది. రాజ్యసభలో కొన్ని బిల్లలు ఆమోదం విషయంలో సీఎం రమేష్ చురుగ్గా వ్యవహరించడం బీజేపీ పెద్దలను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఏపీకి ఓ బెర్త్ ఇవ్వదల్చుకుంటే అది సీఎం రమేష్కేనని ఇప్పటికే చెబుతున్నారు. ఎవరు మంత్రులో అనేది రేపు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.