వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతారని.. వైసీపీలోని పెద్ద పెద్ద నేతలంతా ఈ సారి బీజేపీ గుర్తుపై పోటీ చేస్తారని సీఎం రమేష్ రెండు రోజుల కిందట టీవీ 9 చానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన మాటలను ఇతర పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వైసీపీలో మాత్రం అదే పనిగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు జగన్ ను ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేల సంగతి పెరిగిపోవడం వంటి కారణాలతో బీజేపీ ఆపరేషన్లపై అంతర్గతంగా ఉన్న సమాచారం మేరకు వైసీపీలో ఈ చర్చ జరుగుతోంది.
ఇటీవల ఫామ్ హౌస్ కేసులో సీఎం కేసీఆర్ సాక్ష్యాలు విడుదల చేస్తూ చాలా విషయాలు వెల్లడించారు. అందులో ఏపీ లో వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని… కూడా చెప్పారు. వారు అంగీకరించారా లేదా వారిలో నాయకుడు ఎవరు అన్న విషయం మాత్రం క్లారిటీ రాలేుదు. కానీ కేసీఆర్ మాత్రం అంత ఆషామాషీగా చెప్పి ఉండరన్న అభిప్రాయం ఉంది.
సీఎం జగన్ కు కూడా ఈ అంశంపై అంతర్గత సమాచారం ఉందని అందుకే ప్లీనరీలో ఆయనను వైసీపీ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీని ఎవరో లాగాసుకుంటారన్న అనుమానంతోనే అలా చేశామన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే అంతర్గతంగా ఊహించని రాజకీయం జరుగుతోందని అంటున్నారు. జగన్ వీక్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముందు ముందు ఏం జరుగుతుదంన్నది వైసీపీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.