రాజకీయాల్లో అప్పుడప్పుడు అరుదైన దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. ఉప్పు-నిప్పులా ఉన్న.. ఇద్దరు మనుషులు… ఉల్లాసంగా..ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపిస్తే.. కచ్చితంగా అది.. అరుదైన దృశ్యమే అవుతుంది. రాజకీయ మార్పులకు కూడా.. ఆ దృశ్యం వేదికగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి దృశ్యం లోక్‌సభ గ్యాలరీల్లో కనిపించింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సీరియస్‌గా ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. వారేం మాట్లాడుకున్నా.. అసలు మాట్లాడుకోవడమే విశేషం అయిపోయింది.
లోక్‌సభ గ్యాలరీలో సీఎం రమేష్ – విజయసాయి శిఖరాగ్ర సమావేశం..!
లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. దీన్ని చూసేందుకు గ్యాలరీల్లోకి రాజ్యసభ సభ్యులు.. మాజీ ఎంపీలు.. ఇతర నేతలు వస్తున్నారు. గ్యాలరీల్లో కూర్చుంటున్నారు. అలా ముందుగా.. సీఎం రమేష్… ఓ వరుసగా కూర్చున్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వచ్చి వెనుక వరుసలో కూర్చున్నారు. ఒకరినొకరు చూసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అది కామనే అనుకున్నారు.. అయితే.. కాసేపటికి విజయసాయిరెడ్డి… ముందు వరుసలోకి వచ్చారు. సీఎం రమేష్ పక్కన కూర్చున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. వీరి మధ్య చర్చలు దాదాపుగా గంటన్నర పాటు సాగాయి. సీరియస్‌గా కాకుండా.. పిచ్చాపాటిగా.. మాట్లాడుకున్నట్లుగా.. వ్యవహరించారు.
బద్ధశత్రువుగా ఫీలయ్యే సీఎం రమేష్‌తో విజయసాయికి అంత సుదీర్ఘ చర్చలెందుకు..?
నిజానికి సీఎం రమేష్ అంటే.. విజయసాయిరెడ్డి.. ఒంటికాలి మీద లేస్తారు. ఆయనను సారా వ్యాపారిగా అభివర్ణిస్తారు. అనేక సందర్భాల్లో.. సీఎం రమేష్‌పై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. సీఎం రమేష్ కు చెందిన కాంట్రాక్ట్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్ పై… విజయసాయిరెడ్డి అనేక ఫిర్యాదులు చేశారు. ఏపీలో ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల పై.. అనేక ఆరోపణలు చేశారు. సాక్షి పత్రిక కూడా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించింది. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు విజయసాయిరెడ్డి.. ఉత్తరాంఖండ్‌లోని ఓ పవర్ ప్రాజెక్ట్ లో అక్రమాలు జరిగాయని .. విచారణ జరిపించాలని.. కేంద్రానికి లేఖ రాశారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు రిత్విక్ ప్రాజెక్ట్ చేపట్టిందని.. భారీ అక్రమాలు జరిగాయని.. విచారణ జరిపించాలన్నారు. వెంటనే పీఎంవో కూడా విచారణకు ఆదేశించింది.
చర్చలకు కేవీపీ మధ్యవర్తిగా వ్యవహరించారా..?
సీఎం రమేష్, విజయసాయిరెడ్డి చర్చలు.. గంటన్నర పాటు సాగాయి. అయితే.. రహస్యంగా ఏమీ లేదు. బహిరంగంగా గ్యాలరీల్లోనే మాట్లాడుకున్నారు. వెనుక వరుసలో కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. ఆయన మాత్రం… వీరి దగ్గరకు రాలేదు. చర్చలకు పెద్ద అన్నట్లుగా.. ఆయన దూరంగా చూస్తూండిపోయారు. కారణం లేకుండా.. చర్చించుకోరన్న అభిప్రాయం మీడియా వర్గాల్లో ఉంది. మీడియా ప్రతినిధులు.. ఎం చర్చించారన్న దానికి విజయసాయిరెడ్డి… టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పమని .. అడిగానని చెప్పి.. వెళ్లిపోయాయి.