జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య గురించి వారిద్దరూ కాసేపు చర్చించుకున్నారు! పైకి కనిపిస్తున్న కంటెంట్ ఇది. కానీ, పవన్ రాజధానికి వస్తున్నారని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడం.. దాదాపు మూడు గంటలు పవన్ తో సీఎం చంద్రబాబు చర్చించడం.. ఉద్దానం విషయమై పవన్ చేసిన డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం… వీటన్నింటి ద్వారా టీడీపీ ఇస్తున్న సందేశమేంటి..? ఈ చర్య ద్వారా విపక్ష వైకాపాతోపాటు, కేంద్రంలోని భాజపాకి కూడా ఏదైనా కన్వే చేయాలన్న వ్యూహం చంద్రబాబుకి ఉందా..? ఉన్నట్టుండి జనసేనకు అప్రకటిత మిత్రపక్ష హోదా ఇచ్చినట్టుగా వ్యవహరించడానికి గల కారణాలేంటి..? రాజకీయ వర్గాల్లో ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటే… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమౌతూ ఉండటంతో అక్కడ ప్రాధాన్యత తగ్గుతోంది. పైపెచ్చు, తెలుగుదేశం పార్టీని తమ అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం భాజపా మొదలుపెట్టడం ఖాయం. నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయమై ఎటూ తేల్చకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాల కాషాయీకరణ కంకణం కట్టుకున్న భాజపాది అదే లక్ష్యం! దీనికి తోడు ప్రతిపక్ష వైకాపాను భాజపా చేరదీసుకుంటోంది. అదీ టీడీపీకి ఇబ్బందికరమైన అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో భాజపా పొత్తు టీడీపీతో కొనసాగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ ముందు రెండే దారులున్నాయని చెప్పొచ్చు. ఒకటీ.. భాజపా నాయకత్వానికి జీ హుజూర్ అని తలొగ్గడం. వారు ఆడించినట్టల్లా ఆడేందుకు సిద్ధపడటం! రెండూ.. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, జాతీయ స్థాయిలో ప్రొజెక్షన్ ఇచ్చుకోవడం! టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం తమకే ఉందని భాజపా భావించేలా చేయడం. మొదటి దారిలో చంద్రబాబు వెళ్లరు! ఇక, రెండో దారిలో ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినట్టు చెప్పాలి.
ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి వస్తున్న నాయకుడికి ఈ రీతిన ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడం అనేది చాలా అరుదు! పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెండు మెసేజ్ లు చంద్రబాబు ఇస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఒకటీ.. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో తాము ఎంత చిత్తశుద్ధితో ఉన్నామనేది చాటి చెప్పడం. రెండోది… జనసేన లేవనెత్తుతున్న అంశాలకు తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తామనీ, ఒక సమస్యను భుజాన వేసుకుని వచ్చిన పవన్ కు ఇంత ప్రాముఖ్యత ఇస్తామని చెప్పడం. ఇక్కడ మూడో పాయింట్ కూడా ఉందండోయ్. పవన్ కల్యాణ్ జనసేన, టీడీపీ కలిసే ఉన్నాయనీ.. అలా ఉండటం వల్లనే ఉద్దానం లాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనీ, ఈ కలయిక కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రజలతోపాటు ఇతర రాజకీయ పక్షాలకూ తెలిసేలా చేయాలనేది కూడా వ్యూహం అయి ఉండొచ్చు.