ఈ ఏడాది జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లను పొలాలకు పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సందర్భంగా జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ ఏడాది పూర్తయ్యేనాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అన్నారు. ఇప్పటికైనా డీపీఆర్ ఫైనలైజ్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనికి డబ్బులివ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అన్ని విధాలుగా కష్టపడి ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే, ఏదో ఒక నెపం పెట్టి కావాలని కాలక్షేపం చెయ్యొద్దని కేంద్రాన్ని కోరుతున్నా అన్నారు. దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పుడూ రాదనీ, దేశ ప్రతిష్టను పెంచేందుకే తాము కూడా ప్రయత్నిస్తున్నామనీ, ఇలాంటి పనులకు అడ్డు పడొద్దన్నారు.
కాంక్రీట్ పనుల్లో సాధించిన ఈ కొత్త రికార్డును మార్చిలో మీరే బ్రేక్ చేయాలంటూ కొత్త టార్గెట్ ఇస్తున్నా అని సిబ్బందికి చంద్రబాబు చెప్పారు. ఒకే రోజున 65 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలన్నారు. ఒకప్పుడు, వెస్ట్ బెంగాల్ ఏది ఆలోచిస్తుందో… దేశం అది ఆలోచిస్తుందని అనేవారనీ… కానీ, ఈరోజున ఆంధ్రప్రదేశ్ ఏది సాధించిందో, మిగిలిన రాష్ట్రాలు మనల్ని అనుసరిస్తాయని అన్నారు. 2015 నుంచి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నాననీ, పోలవరం పూర్తయిన తరువాతే సోమవారం గుర్తుచేసుకుంటా అన్నారు. తొలిరోజున ఇక్కడికి వచ్చినప్పుడు బాధా ఆవేశం, పనిగాకపోతే ఆందోళన ఉండేవనీ, ఒక్కోసారి కోపంగా కూడా వచ్చేదన్నారు. ఈరోజున ఆ కోపాన్ని ఒక కసిగా మార్చుకున్నామనీ, ఈరోజున ఇంత చేయగలిగామంటే ఆ తృప్తీ ఆనందం చాలా ఉందన్నారు.
డయాఫామ్ వాల్ నిర్మాణంలో అనేక సమస్యలు వచ్చాయనీ, జెట్ గ్రౌటింగ్ కి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయనీ, ఇంకోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించలేదన్నారు. పట్టిసీమ వస్తే అవినీతి ఆరోపణలు చేశారనీ, కానీ పట్టుదలతో పూర్తి చేశామన్నారు. అనంతపురం జిల్లాకు నీరు తీసుకెళ్లామనీ, వ్యవసాయంలో నంబర్ వన్ స్థానానికి ఆ జిల్లా వచ్చిందనీ, అదే సమయంలో కియా మోటార్స్ వచ్చిందనీ ఈ నెల 29న అనంతపురంలో తయారు చేసిన కారు రోడ్లు మీదకి వస్తోందంటే చాలా ఆనందంగా ఉందన్నారు. నిజానికి, పోలవరం పూర్తయితే ఆ క్రెడిట్ భాజపాకి కూడా దక్కుతుంది. ఎందుకంటే, నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే. కానీ, కేవలం రాజకీయ దృక్పథంతోనే కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ వైఖరిలో అనూహ్య మార్పు అనేది ఊహించలేం. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు విడుదల చేసినా చాలు.