హైదరాబాద్ సిటీ కమిషనర్ అంటే మంచి పోస్టు. ఐపీఎస్ లకు అందరికీ ఉండే కల డీజీపీ. అయితే, డీజీపీ అయిన వారిలో చాలా మంది హైదరాబాద్ సిటీ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన వారే అధికంగా ఉంటారు. కారణం… సిటీ కమిషనర్ పోస్టు అంటే కత్తిమీద సామే.
ఇప్పటి వరకు ఉన్న కమిషనర్ కొత్తకోట దయాకర్ రెడ్డి చాలా ముక్కుసూటి మనిషి. నిర్మోహమాటంగా ఉంటారు. రాజకీయ నాయకులు అయినా, అధికారులు అయినా సరే… తన స్టైల్ ఒకేలా ఉంటుంది. కానీ, నగరంలో ఇటీవల పెరుగుతున్న క్రైం రేటు, విధానపరమైన నిర్ణయాల దృష్ట్యా ఆయనపై బదిలీ వేటు పడింది. ఆ స్థానంలో గతంలో సక్సెస్ ఫుల్ సీపీగా పేరున్న సీవీ ఆనంద్ ను తీసుకొచ్చారు.
ఐపీఎస్ సీవీ ఆనంద్… రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన నాటి నుండి ఏసీబీ చీఫ్ గా ఉన్నారు. గతంలో ఏసీబీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది అన్న సంగతే మర్చిపోయారు. కానీ, కొన్ని రోజులుగా ఏసీబీ దూకుడుగా ఉంది. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా పట్టుబడ్డారంటే వారి పనితీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే, మరోసారి సీపీగా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారుల విషయంలో సీఎం రేవంత్ ఇప్పటికీ అంతే కఠినంగా ఉన్నారు. అందుకే అప్పుడు కీలక శాఖల్లో ఉన్న అధికారులను లూప్ లైన్ పోస్టుల్లోనే పెట్టి, మంచి పేరున్న అధికారులతో పాలనను గాడిన పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తాజా ఐపీఎస్ బదిలీలు చూస్తే అర్థం అవుతోంది.