తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లుగా సాగిపోయిన రాజకీయంలో రేవంత్ రెడ్డి అనే నాయకుడు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఎంత అంటే చివరికి ఆ కేసీఆర్ నుంచి సీఎం సీటు లాగేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆయన ముద్ర ఉండకుండా చేయాలని పట్టుదలగా పని చేస్తున్నారు. పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని నిరూపించేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఏడాది సీఎంగా ఆయన ఎదురు దెబ్బలు తిన్నారో .. రాటుదేలిపోయారో కానీ కేసీఆర్ ను మరిపించేలా కొన్ని విషయాల్లో మాత్రం తనదైన ముద్ర వేశారు.
కేసీఆర్ పదేళ్ల పాటు సీఎంగా ఉన్నా ఎప్పుడూ ప్రజల్ని కలిసింది లేదు. అయితే ఇల్లు లేకపోతే ఫామ్ హౌస్ అన్నట్లుగా ఆయన పాలన సాగేది. నెలల తరబడి ఆయన ప్రజలకు కనిపించేవారు కాదు. గడీలాగా కట్టుకున్న ఇంటి దరిదాపుల్లోకి సామాన్యుడు వెళ్లలేకపోయేవాడు. అలాంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి మనోజ్.. మన ఎదురుగానే ఉంటాడు అనే పరిస్థితిని రేవంత్ తీసుకు వచ్చారు. ఎవరు కలుస్తామని అపాయింట్ మెంట్ అడిగినా సరే తిరస్కరించరు. ఆయన అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.. ఈ విషయంలోకేసీఆర్ ఎవరికీ గుర్తుకు రారు.
ఈ ఒక్క విషయంలోనే కాదు పాలన విషయంలో ప్రజాస్వామ్య పద్దతుల అమలు విషయంలోనూ రేవంత్ కేసీఆర్ కన్నా ఎంతో ఎత్తులో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అందరూ ధైర్యంగా ప్రశ్నించగలుగుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని బీఆర్ఎస్ అరెస్టుల డ్రామాలు ఆడే ప్రయత్నం చేస్తున్నా చేసుకోనిస్తున్నారు కానీ.. హడావుడి చేయలేదు. పదేళ్ల పాటు విపక్షాలు తెలంగాణలో రోడ్ల మీదకు రాలేని పరిస్థితి ఉండేది. ఇప్పటికి ఏడాది మాత్రమే అయింది. మరో నాలుగేళ్లు ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ గుర్తుల్ని చెరిపేయడానికి ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. మొదటి ఏడాది ఆ దిశగా గట్టి పునాది వేసుకున్నారని అనుకోవచ్చు.