కేటీఆర్ , హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డిల ఫామ్ హౌజ్ లను కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిరాయి మనుషులతో కేటీఆర్ , హరీష్ రావులు హడావిడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మూసీని అడ్డంపెట్టుకొని ఎంతకాలం బ్రతుకుతారు అని నిలదీశారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చించినప్పుడు బీఆర్ఎస్ , బీజేపీ నేతలు ఎందుకు సలహాలు, సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ లోని సిఖ్ కాలనీలోని ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ సుందరీకరణపై వివాదాన్ని సృష్టిస్తోన్న బీఆర్ఎస్ నేతలు.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కంటే ప్రత్యామ్నాయం ఏముంటుందో చెప్పాలన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం..వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వండని కోరారు. కేటీఆర్ , హరీష్ రావు , సబితా కుమారుల ఫామ్ హౌజ్ ల కూల్చాలా వద్దా అని ప్రశ్నించారు.
చిన్ననాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని కాపాడుకుందాం..కేటీఆర్ , హరీష్ రావు సచివాలయానికి రండి.. నగర అభివృద్ధి, మూసీ బాధితులను ఆదుకునే విషయంపై చర్చిద్దాం అని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించింది ఎవరో తేల్చుదామన్నారు. ఈ ప్రభుత్వం పేదల కన్నీళ్లను చూడదల్చుకోలేదు. మూసీ నిర్వాసితులను ఖచ్చితంగా ఆదుకుంటామని , ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.
కేటీఆర్ , హరీష్ రావు మాట్లాడిన మాటలను మరుసటి రోజు ఈటల రాజేందర్ మాట్లాడుతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ మారిన ఆయనకు బీఆర్ఎస్ వాసన మాత్రం పోలేదన్నారు. మోడీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు..మేము మాత్రం మూసీని అభివృద్ధి చేసుకోవద్దా? ఇదేం లెక్క ఈటల అంటూ ప్రశ్నించారు. పేదలపై ప్రేమను ఒలకబోస్తున్న ఈటల రాజేందర్ నేతృత్వంలోనే నిధుల కోసం మోడీ వద్దకు వెళ్దాం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తీసుకొని రండి.. 25వేల కోట్లు ఇప్పించండన్నారు రేవంత్ రెడ్డి.