చెరువు శిఖం భూములు, ఫుల్ ట్యాంక్ లెవల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు సరే.. మరి వాటికి అనుమతి ఇచ్చిన అధికారుల సంగతేంటి అన్న ప్రశ్న ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు దానికి సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది. అక్రమ కట్టాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కేసులు పెట్టనున్నారు. ఈ మేరకు హైడ్రా ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తప్పు చేసిన అధికారులను అలా వదిలేస్తే.. తమకేమీ సమస్య రాదుగా అని.. అనుమతులు ఇచ్చే అధికారులు ఇస్తూనే ఉంటారని.. వారిని కట్టడి చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు ఇవ్వబట్టే వారు కట్టుకున్నారని… నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అనుమతులు మంజూరు చేసిన వారిదే మొదటి తప్పని నిర్ణయానికి వచ్చారు. లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
హైడ్రా.. ఇప్పుడు లిస్ట్ మొత్తం రెడీ చేసింది. కూల్చి వేతలకు సిద్ధం అవుతోంది.. అయితే ఎక్కువగా కాలేజీలు, విద్యాసంస్థలు ఉండటంతో వాటి విషయలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముందుగా నోటీసులు ఇచ్చి వాటిని షిఫ్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇచ్చిన గడువు తర్వాత నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని అంటున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీని సమావేశపర్చే విషయంపైనా సీఎం రేవంత్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.