తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. సోనియా సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ హాజరైన కార్యక్రమంలో అట్టహాసంగా ప్రమాణం చేశారు. రేవంత్ కాకండా మరో పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆరు గ్యారంటీల అమలు కోసం సంతకం చేశారు.
ఆ తర్వాత సెక్రటేరియట్ కు వెళ్లారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు బయలుదేరారని తెలుసుకుని మూడు కిలోమీటర్ల ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు సీఎం కాన్వాయ్ తోనే లోపలకు వెళ్లారు. ఇలా సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టగానే అలా మార్పులు ప్రారంభించారు. డీజీపీ కన్నా ముందు ఇంటలిజెన్స్ చఫ్ ను మార్చేశారు. బి.శివధర్ రెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్ ను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారు. ఇంటలిజెన్స్ తోనే.. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలందర్నీ బీఆర్ఎస్ నేతలు ఓ ఆట ఆడుకున్నారు. ఏ అధికారి ఏం చేశారో ఆయనకు స్పష్టత ఉంది. అందుకే ముందుగా ఇంటలిజెన్స్ చీఫ్ ను నియమించుకున్నారు. తర్వాత సీఎం వ్యవహారాలు చూసేందుకు శేషాద్రి అనే అధికారిని నియమించారు.
నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తెలంగాణ మొదటి ఇంటలిజెన్స్ చీఫ్. కేసీఆర్ తొలి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయననే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. కానీ రెండేళ్లలో మార్చేశారు. అసలేమయిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఆయన లూప్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏడీజీగా రైల్వేస్ , రోడ్ సేఫ్టీలో ఉన్నారు. ఆయన ను రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించడం ఆసక్తికరంగా మారింది.