విజయవాడ దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజలపై కొద్దిరోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 26న అర్ధరాత్రి వేళ అమ్మవారి గర్భగుడిలో జరిగినవి తాంత్రిక పూజలా కాదా అనేదానిపై ఇంకా రావాల్సిన స్పష్టత రాలేదనే చెప్పాలి. అయితే, ఈ విషయమై నిగ్గు తేల్చేందుకు నియమించిన కమిటీలకు సంబంధించిన నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరాయి. దేవాదాయ శాఖ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ 40 మందిని విచారించింది, ఆ శాఖ తరఫున పూర్తి నివేదికను మంత్రి మాణిక్యాలరావు ఇచ్చారని తెలుస్తోంది. ఇక, పోలీసు శాఖ పరంగా చూసుకుంటే అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించి పొందుపరచిన మరో నివేదికను కూడా ముఖ్యమంత్రికి సీపీ గౌతమ్ సమాంగ్ అందజేసినట్టు సమాచారం. దీంతోపాటు ఇదే విషయమై వన్ టౌన్ పోలీసులు నమోదు చేసుకున్న కేసుకు సంబంధించిన విచారణ నివేదిక కూడా సీఎంకు చేరినట్టు చెబుతున్నారు.
ఈ నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. దేవాదాయ, పోలీసు శాఖలతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి ఆలయ ఈవోగా పనిచేస్తున్న సూర్యకుమారిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ కమిషనర్ కు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ పూజలకు సంబంధించి మరింత లోతైన విచారణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వేళగాని వేళలో దుర్గ గుడిలోకి ముగ్గురు బయట వ్యక్తులు ఎలా ప్రవేశించారనీ, ఇది పాలనాపరమైన లోపంగా చూడాలని సీఎం పేర్కొన్నారు. అనంతరం దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ… ఆలయంలో పాలనా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనీ, సూర్యకుమారి ఈవోగా కొనసాగితే విచారణ సజావుగా సాగదనీ, అందుకే ఆమెను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
సీఎం ఆగ్రహించారు, ఈవోని తొలగించారు, లోతైన దర్యాప్తు చేయమన్నారు.. ఇంతవరకూ బాగానే ఉంది! కానీ, డిసెంబర్ 26న దుర్గగుడిలో పూజలు జరిగాయన్నది దాదాపు స్పష్టమైంది కదా. అయితే, అలా జరిగిన పూజలు తాంత్రిక పూజలా కాదా..? ఒకవేళ తాంత్రిక పూజలు జరిగితే అవి ఎవరికోసం జరిపారు..? ఎందుకు జరిపారు అనే అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందనే చెప్పాలి. జరిగినవి తాంత్రిక పూజలే అనే స్పష్టత అధికారికంగా ఎక్కడా బయటపెట్టినట్టు లేదనే సమాచారం తెలుస్తోంది. అయితే, ఈ పూజలు నిర్వహించిన పార్థసారధి, అలియాస్ రాజా విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అవి తాంత్రిక పూజలే అని ఆయన ఒప్పుకున్నట్టు అనధికారికంగా ఓ కథనం ప్రచారంలో ఉంది. ఏదేమైనా, మొదట్నుంచీ ఈ వ్యవహారంపై కొంత గందరగోళమే నెలకొంది. ఇప్పటికీ అదే కొనసాగుతున్నట్టుగా చూడొచ్చు.