ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నిర్ణయాలు విలువను తగ్గిస్తాయని తెలుస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా అలాగే చర్చనీయాంశం అవుతోంది. సీఎం పేరు మీదుగా ఇచ్చే శౌర్య పతకం విలువను తగ్గించేశారు. ఉగాది సందర్భంగా పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటిస్తారు. అంటే విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చూపిన వారికి ఈ పతకాలు ఇస్తారు. ఈ పతకం అందుకున్న వారికి ప్రతి నెలా రూ. ఐదు వందల అదనపు ప్రోత్సాహకం లభిస్తుంది.
రూ. ఐదు వందలు తక్కువ మొత్తమైనా ప్రతీ నెలా జీతంతో పాటు కలిసి వచ్చేది కాబట్టి … శౌర్యపతకాలు పొందిన వారికి కాస్తంత సంతృప్తి ఉండేది. సీఎం పేరు మీద పతకాన్ని అందుకుంటున్నదానికి విలువ ఉండేది . ఇప్పుడు ప్రభుత్వం హఠాత్తుగా రూ. 500 ఇవ్వలేమని.. దాన్ని రూ. 150కి తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఈ ఉత్తర్వులు చూసి సీఎం శౌర్యపతకం పొందిన వారు ఖంగుతిన్నారు. ఇప్పటి వరకూ వస్తున్న వాటిలో కూడా రూ. 350 కోత పెట్టిన ప్రభుత్వాన్ని చూసి ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతున్నారు.
సీఎం శౌర్య పతకం అనేది.. సీఎం పీఠానికి ఉండేది గౌరవాన్ని సూచిస్తుంది. ఆ పతకానికి ఇచ్చే పారితోషికాన్ని తగ్గించడం.. అంటే సీఎం స్థాయి.. విలువను తగ్గించడమే. అయితే ప్రభుత్వం ఇలా సీఎం కుర్చీ విలువను తగ్గించినా పర్వాలేదనుకుంటోంది. ఓ వైపు సీఎం వ్యక్తిగత పర్యటనలకు కూడా అత్యంత లగ్జరీ విమానాలు వాడుతున్నారు. ఎలాంటి దూరానికైనా హెలికాఫ్టర్లోనే వెళ్తున్నారు. సలహాదారులకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న అంశాల్లో మాత్రం ఆదా కోసం అంటూ… విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.