ఏపీలో వైసీపీ నేతలు హైకమాండ్ నుంచి సంకేతాలు వస్తే చాలు రెచ్చిపోతారు. అమ్మనా బూతుల్ని అసువుగా మాట్లాడేస్తారు. తాము రాజకీయ నేతలమనే సంగతిని మర్చిపోతారు. ఎక్కడ ప్రభుత్వ పెద్దల్ని సంతృృప్తి పరచకపోతే తమ పదవి ఊడిపోతోందో లేకపోతే కొత్తగా రాదో అని మథనపడతారు. బూతుల రేసు పెట్టుకుంటారు. దీన్ని హైకమాండ్ ఆనందిస్తుంది. అయితే విచిత్రంగా ఈ సారి ఏపీ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారట. నిజంగా అయ్యారో అభినందించారో తెలియదు కానీ… సీఎంవో నుంచి మాత్రం అనధికారికంగా ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు.
అయితే అప్పలరాజు అన్న మాటలు టీడీపీ నేతలను ఉద్దేశించి కాదు..తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి అన్నవి. మంత్రి పదవి తీసేస్తారని ప్రచారం జరుగుతున్న అప్పలరాజు.. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయ ఉగ్రవాదువాదులు అని సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు సీదిరి అప్పలరాజు. వారంతా తాగుబోతులన్నారు. ఆంధ్రా ప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప.. అక్కడ ఏమీ ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాయకూడని భాషలో చాలా కామెంట్స్ చేశారు మంత్రి అప్పలరాజు.
అప్పలరాజు కామెంట్స్ పై తెలంగాణలోనూ విస్తృత ప్రచారం జరిగింది. ఇంత దారుణంగా మాట్లాడారేమిటని బీఆర్ఎస్ నేతలూ ఆశ్చర్యపోయారు. వైసీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు కోపం వచ్చిందని తెలుసుకున్న సీఎంవో సీఎం సీరియస్ అయ్యారని చిన్న హింట్ బయటకు ఇచ్చింది. నిజానికి అసలు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంతోషపడి ఉంటారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.