ఆలయ అర్చకులకు వంశపారంపర్య హక్కులు సక్రమింపజేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్క తిరుమల శ్రీవారి ఆలయం మినహా అన్ని ధార్మిక సంస్థల అర్చకులకు ఈ వంశపారంపర్య హక్కులు సంక్రమించేలా ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో పేర్కొంది. నిజానికి ఈ హక్కులు కల్పించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్నారు. నాడు చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న సమయంలో.. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన ఐవైఆర్ కృష్ణారావు.. ఈ విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. జీవో నెంబర్ 76కు ప్రాధమిక స్థాయి నోటిఫికేషన్ విడుదలయింది. అయితే.. ఆ తర్వాత ఐవైఆర్ చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. రమణదీక్షితులు… రాజకీయ కారణాలతో ప్రభుత్వంపై ఆరోపణలు ప్రారంభించారు. అర్చక సంఘాలు కొన్ని వైసీపీకి మద్దతుగా మారడంతో.. ఆ ప్రయత్నం అక్కడితోనే ఆగిపోయింది.
ఆలయాల అర్చకులకు వారసత్వ ప్రయోజనం ఉన్నా 1987లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రయోజనాలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసింది. దీంతో అరకొర వేతనాలు, విరాళాలతో కాలం గడుపుతూ వచ్చేవారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో వారసత్వం పునరుద్ధరణపై కసరత్తు చేశారు. కొన్ని అభ్యంతరాల నేపధ్యంలో ముందడుగు పడలేదు. అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2017లో తిరిగి ఈ విషయంపై దృష్టి సారించారు. జీవో 76 విడుదల చేసి వారసత్వ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. జీవో నెంబర్ 76 ప్రాధమిక నోటిఫికేషన్ జీవో ఇచ్చినప్పుడు.. సీఎంవోలోని కొంత మంది అధికారులు అడ్డుపడ్డారన్న ప్రచారం జరిగింది. టీటీడీకి సంబంధం లేకుండా.., ఇతర ఆలయాలన్నింటికీ వర్తింపచేస్తూ ఆదేశాలు ఇవ్వాలని బ్రాహ్మణ నేతలు కోరుతూ వచ్చారు. దీనిపై చంద్రబాబు పలుమార్లు సమావేశమయ్యారు. కానీ.. నిర్ణయం తీసుకోలేదు.
ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. జగన్ అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే గత ప్రభుత్వం కసరత్తు మొత్తం చేసి ఉండటంతో… ఇప్పుడు ఆదేశాలు జారీ చేసేశారు. అంటే.. చంద్రబాబు.. నిర్ణయం తీసుకోకుండా నాన్చారు.. కానీ జగన్ మాత్రం.. చంద్రబాబు సర్కార్ తెచ్చిన జీవో 76కు సవరణలు చేసి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేసింది. క్రెడిట్ అంతా… జగన్ ఖాతాలో పడిపోయింది. చంద్రబాబు సమావేశాలతో నాన్చడం వల్ల… చివరికి జగన్ కే మేలు జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్ణయాలు తీసుకునేందుకు కూలంకుషంగా చర్చించడం కరెక్టే కానీ.. అలా చర్చించిన తర్వాత కూడా నిర్ణయాలు తీసుకోపోవడం.. వల్ల ఏం జరుగుతుందో.. ఈ వ్యవహారంలో తేలిపోయిందనే కామెంట్లు టీడీపీలోనే వినిపిస్తున్నాయి.