మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో.. సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఆగస్టు పదిహేనో తేదీన విశాఖ నుంచి ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎంవో ఎక్కడ ఉండాలన్నదానిపై.. అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు పదిహేనో తేదీన.. సీఎం విశాఖలో తన కార్యాలయంలో పూజ చేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని శాఖలను… విశాఖకు తరలించనున్నారు. రెండు, మూడు నెలల్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా… విశాఖను.. పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
ప్రస్తుతానికి.. బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినందున.. న్యాయపరమైన చిక్కులేమీ లేవు. వాటిపై.. హైకోర్టులో పిటిషన్లు పడిన తర్వాత.. విచారణ జరగాల్సి ఉంది. వాటిపై.. హైకోర్టు స్టే ఇస్తే తప్ప… ఆగే అవకాశం లేదు. ఒక వేళ స్టే ఇచ్చినా.. ఏదో విధంగా.. న్యాయపరమైన లొసుగులు చూసుకుని.. జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్లిపోవడానికే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే.. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలించాలో .. ముఖ్యమంత్రి ఇష్టమని… దానికి చట్టాలు అవసరం లేదని. జగనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు.
అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టి.. విశాఖను ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని జగన్ చెబుతున్నారు. దానికి మొదటగా.. సీఎంవో కార్యాలయంతోనే అడుగుపడే అవకాశం ఉంది. బోగాపురం విమానాశ్రయం ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తీసుకున్న ఐదు వందల ఎకరాల్లో కూడా… కాస్తంత రాజధాని ప్రాజెక్టును జగన్ కట్టనున్నారు. దీంతో.. విశాఖ సమగ్రాభివృద్ధికి.. ప్రణాళికలు సిద్ధమైనట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.