ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిధుల్ని దొంగ చెక్కులతో కొల్లగొట్టబోయిన వ్యవహారం అప్పుడప్పుడూ ఏసీబీ అధికారులు తెర ముందుకు తెస్తున్నారు. తాజాగా మరోసారి మీడియాకు ఈ కేసులో ఓ లీక్ ఇచ్చారు. మొత్తం రూ. 117 కోట్లను కొట్టేయడానికి కుట్ర జరిగిందని గతేడాది సెప్టెంబర్లో ఈ కేసు నమోదైంది. అప్పట్నుంచి విచారణ జరుపుతున్నారు. ప్రజాప్రతినిధుల ఏపీలు, వారి అనుచరులు ఉద్యోగులతో కుమ్మక్కయి స్వాహా చేసినట్లుగా చెబుతున్నారు. వారెవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. చెప్పడం లేదు.
గత ఏడాది సెప్టెంబర్లో సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న మూడు చెక్కులు.. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఎస్బీఐ బ్రాంచీల్లో జమ అయ్యాయి. మూడు కలిపి రూ. 117 కోట్లు సొమ్ము తమ ఖాతాలకు మళ్లించుకోవాలనుకున్నారు. చివరి క్షణంలో గుట్టు రట్టయింది. అప్పుడే సీఎంఆర్ఎఫ్ విషయంలో విచారణ ప్రారంభమయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఇలాంటి ఫేక్ చెక్కులతో కొన్ని నిధులు డ్రా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ ఏసీబీ అధికారులు పెద్దగా విచారణ చేయలేదు.
ఆ తర్వాత మూడు నెలల కిందట సీఎంఆర్ఎఫ్ ఫండ్ ను చూసే ఉద్యోగులు పేదల వివరాలు సేకరించి వారి పేరుపై నిధులు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గొల్లపూడిలోని ఆఫీసుకు ఉద్యోగులందర్నీ పిలిపించి ప్రశ్నించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఏసీ బీ అధికారులు మళ్లీ హడావుడి ప్రారంభించారు. అసలు దొంగ చెక్కులు వేసింది ఎవరో కనిపెట్టడం చాలా సింపుల్. ఏ అకౌంట్లో వేసుకున్నారోవాళ్లను పట్టుకుంటే పనైపోతుంది. కానీ పోలీసులు ఆ దిశగా కాకుండా విచారణను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.