తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం మరోసారి సమావేశం కావాలనుకుంటున్నట్లు సమాచారం. పదేళ్లు అవుతున్నా విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలు చాలానే ఉన్నాయి. అందుకే చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు త్వరలోనే సమావేశం అవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
రేవంత్ , చంద్రబాబులు సీఎంగా బాధ్యతలు చేపట్టాక విభజన సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చారు. గతేడాది జులైలో ప్రజా భవన్ లో భేటీ అయ్యారు. విడిపోయి పదేళ్లయినా చట్ట ప్రకారం జరగాల్సిన పంపకాలు పూర్తికాకపోవడంపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా ఈ విషయం సద్దుమణిగేలా చొరవ తీసుకోవాలనుకున్నారు. అప్పట్లో చర్చించిన విషయాల్లో స్టేటస్ ఏంటి? మిగతా విషయాల్లో పరిష్కారం కోసం మరోసారి భేటీ అయి చర్చించించాలని అప్పట్లోనే నిర్ణయించారు.
పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నా, విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపలేదన్న అభిప్రాయం ఉద్యోగవర్గాల్లో ఉంది. జగన్ తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వాటిని నాన్చారు. ఇప్పుడున్న సీఎంలు వాటిని అలాగే వదిలేయవద్దని భావిస్తున్నారు. సాగునీరు విషయంలో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని, తెలంగాణ నీటిని కొత్త ప్రాజెక్టుల ద్వారా ఏపీకి తరలించేలా ప్రయత్నాలు చేస్తుంటే రేవంత్ మాట్లాడటం లేదని బీఆర్ఎస్ నేతలు గొంతు చించుకుంటున్నారు. తెలంగాణ ఎడారిగా మారి, భూములు ఎండిపోతున్నాయని, దీనికి రేవంత్ , చంద్రబాబులు కారణం అనే అభిప్రాయాన్ని కలిగించేలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల అంశం, ఆస్తులు..ఇలా పలు విభజన సమస్యలపై మరోసారి భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కేంద్ర పరిధిలోని అంశాలపై కూడా చర్చించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశం ఉపయోగ పడుతుందని అనుకుంటున్నారు.