తెలుగు360 రేటింగ్: 3.25/5
జీవితం ఓ ప్రయాణం. అది ఒకరిదే అయినా… చుట్టుపక్కల ఉన్న ఎన్నో జీవితాలతో ముడి పడి ఉంటుంది. మన కథలోకి ఎంతోమంది వస్తారు, పోతారు. కొంతమంది అనుభూతులుగా మిగిలిపోతే, ఇంకొంతమంది తీపి గాయాల్ని రగిల్చి వెళతారు. ఆ జ్ఞాపకాలన్నీ కాన్వాస్‌పై తీసుకురాగలిగితే… అందమైన బతుకు చిత్రంగా మిగిలిపోతుంది. వాటిని వెండి తెరపై తీసుకొస్తే.. అదే ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇందులో ఎన్నో కథలున్నాయి.. ఎన్నో జీవితాలు ఉన్నాయి. వాటన్నింటినీ గుది గుచ్చి… ఒకే పొట్లాం కట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఆ ప్రయత్నం ఎలా సాగింది? ఈ సినిమా ఎలా ఉంది?
కథ
కంచరపాలెంలోని రాజు ఓ గవర్నమెంటు ఆఫీసులో గుమస్తా. నలభై తొమ్మిదేళ్లొచ్చినా… పెళ్లి కాదు. రాజు, అతని పెళ్లి… ఆ ఊర్లో ఓ హాట్ టాపిక్. రాజు ఆఫీసుకి బరిస్సా నుంచి బదిలీపై వస్తుంది రాధ. ఆమె వయసు 42. భర్త లేడు. ఇరవై ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. రాజు మంచితనం చూసి.. అతన్ని ఇష్టపడుతుంది. `మనం పెళ్లి చేసుకుందామా` అని అడుగుతుంది.
మరోవైపు ఎనిమిదో తరగతిలోనే ప్రేమలోపడిన సుందరం అనే స్కూలు కుర్రాడి కథ నడుస్తుంటుంది. తన క్లాసు అమ్మాయి సునీత అంటే చాలా ఇష్టం. సునీత గొంతు బాగుంటుంది. పాటలు పాడుతుంది. కానీ అలా పాటలు పాడడం సునీత తండ్రికి ఇష్టం ఉండదు. పంద్రాగస్టుకి స్కూల్ స్టేజీపై పాట పాడిన సునీత…ఆ తరవాత ఊరు వదిలి వెళ్లిపోవాల్సివస్తుంది.
గెడ్డం బాబు… ఓ బ్రాందీ షాపులో పనిచేస్తుంటాడు. ప్రతీరోజూ ఓ ముస్లిం అమ్మాయి వచ్చి క్వార్టర్ మందు కొనుక్కుని వెళ్తుంటుంది. ఆ ముస్లిం అమ్మాయి మత్తులో పడిపోతాడు ఈ గెడ్డం బాబు. కాకపోతే.. ఆ అమ్మాయి ఓ వేశ్య అని తరవాత తెలుస్తుంది.
ఇంకోవైపు జోసెఫ్ – భార్గవిల ప్రేమకథ. ఇద్దరి మతాలు వేరు. అందుకే భార్గవి తండ్రి వీరి ప్రేమకు అడ్డుపడతాడు. జోసెఫ్ ఊర్లో లేని సమయంలో భార్గవి పెళ్లికి ముహూర్తం పెడతాడు.
ఈ సంఘర్షణల నుంచి ఈ జంటలు బయటపడ్డాయా, లేదా? తమ జీవితాల్ని ఎలా మార్చుకున్నాయి..? వాళ్లకు ఎదురైన మనుషులు, పరిస్థితులు ఎలాంటి అనుభవాల్ని, పాఠాల్నీ నేర్పించాయి? అనేదే ‘కేరాఫ్ కంచరపాలెం’ కథ.
విశ్లేషణ
ఎందుకో తెలుగు సినిమా గ్లామర్ ఛట్రంలో ఇరుక్కుపోయి సాగుతుంది. తెరపైన ఎప్పుడూ లార్జర్ దెన్ లైఫ్ కథలే కనిపిస్తాయి. అసలైన జీవితం, అనుభవాలు అక్కర్లేకుండా పోయాయి. ఏ మరాఠీ సినిమానో, గుజరాతీ కథో చూస్తునప్పుడు `వాళ్ల జీవితాల్ని భలే బాగా చూపించాడే` అనిపిస్తుంటుంది. తెలుగులోనూ అలాంటి ప్రయత్నం చేసిన సినిమాగా `కంచెర పాలెం` నిలుస్తుంది. ఇందులో సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. పద్ధతిగా కావాలని రాసుకున్న డైలాగులు ఉండవు. ఇది ఇంట్రవెల్ బ్యాంగు, ఇది క్లైమాక్స్ ట్విస్టు.. ఇలా ఏమీ కనిపించవు. ఈ ఫ్రేముని అందంగా చూపించాలన్న మైండ్ సెట్ ఉండదు. నిజంగా.. నిజాయతీగా కంచెరపాలెం, అక్కడి మనుషులు, మనస్తత్వాలు ఎలా ఉంటాయో.. అద్దంలో చూపించినట్టు ఆవిష్కరించాడు. కంచరపాలెం అనే ఊర్లో ఎక్కడో ఓ మూల కూర్చుని, అక్కడి మనుషుల్ని గమనిస్తున్న ఫీలింగ్ కలిగించాడు. బహుశా… ఈ సినిమాకి ఆత్మ, అంతరాత్మ ఆ ఫీలింగే కావొచ్చు.
రాజు పాత్ర విషాదాన్ని, వియోగాన్నీ, ఒంటరితనన్నీ మోస్తుంటుంది. అలాగని… ఆ పాత్రేం వేదాంతాలు వల్లించేయదు. అచ్చం మనలానే మాట్లాడుతుంటుంది. నవ్విస్తుంది. ఈ కథని నడిపిస్తుంది. సుందరంని చూస్తుంటే… మన బాల్యం గుర్తొస్తుంది. తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి కోసం వెంటపడడం, ఆ అమ్మాయి దక్కలేదని దేవుడ్ని దూషించడం వెనుక… పసితనపు అమాయకత్వం తొణికిసలాడుతుంది. గెడ్డం వాడి కథైతే మనసుని మెలిపెట్టేస్తుంది. ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుంది ఈ రోజుల్లో? అని తడుముకునేలా చేస్తుంది. నిజంగా సలీమా లాంటి అమ్మాయిని ప్రేమించగలమా? ప్రేమించినా అంత నిజాయతీగా ఉండగలమా? అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది.
ఈ మూడు కథల మధ్య జోసెఫ్ కథే తేలిపోతుంది. అలాగని మరీ ఆ కథని తీసి పారేయలేం. రెండు మహావృక్షాల మధ్య.. మరో వృక్షం ఎదగడం మహా కష్టం. జోసెఫ్ ప్రేమకథలోనూ అదే జరిగింది.
ఈ నాలుగు ప్రేమకథల్ని ఎక్కడ ముడిపెడతాడు? ఏ మలుపుకి తీసుకొస్తాడు? అనే ఆసక్తి ఈ సినిమా చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడికీ కలుగుతుంది. ఈ కథల్ని దర్శకుడు ముడి పెట్టిన విధానం.. ఆకట్టుకుంటుంది. నాలుగు కథల్నీ ఓ చోట చేర్చడంలోనే దర్శకుడి పనితనం అర్థం అవుతుంది. అయితే ఈ స్క్రీన్‌ప్లే ట్రిక్కు ‘మనమంతా’, ‘అ’లో చూసేసినదే. అయినా సరే, బాగానే అనిపిస్తుంది. నిజానికి నాలుగు కథల్నీ కలపాల్సిన పని లేదు. విడివిడిగా చూపించినా బాగుంఉటంది. కాకపోతే… ఆ కథలకు ఓ అందం, అర్థం రావాలంటే… కలపాల్సిందే. దర్శకుడు ప్రతీ ఎమోషన్ నీ నిజాయతీగా ఆవిష్కరించాలనుకున్నాడు. ఆ పనే చేశాడు కూడా. సహజత్వం కోల్పోకుండా జాగ్రత్తపడుతూనే… అందులోంచే వినోదం, బాధ, నవ్వు, కన్నీళ్లు.. ఇవన్నీ రాబట్టుకున్నాడు. ప్రతీ పాత్రలోనూ చిన్నపాటి హ్యూమర్ ఉంటుంది. అమాయకత్వం కనిపిస్తుంది. ‘అరె..’ అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇవన్నీ స్వఛ్చంగానే ఉంటాయి.
అలాగని లోపాలేం లేవా?? అంటే.. ఉన్నాయి. స్వచ్ఛతలో ఆకర్షణే కాదు, వికర్షణా కనిపిస్తుంటుంది. ఉన్నది ఉన్నట్టు చూపించడంలో అందాలతో పాటు లోపాలు కూడా బహిర్గతమవుతాయి. దర్శకుడు వాస్తవికత అనే మాయలో పడిపోయాడు. సినిమాటిక్ విషయాల్ని పూర్తిగా విస్మరించాడు. అందంగా కనిపించాల్సిన మొహాలు కూడా బేలగా ఉంటాయి. చివర్లో `ఇంకా ఏదో ఉంటే బాగుండేదే..`అనే అసంతృప్తి కలిగితే… అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఓ భావాత్మక ముగింపు ఇవ్వాల్సిన చోట… మామూలు సినిమాల్లానే హ్యాపీ ఎండింగ్‌తో ముగించాడు.
నటీనటులు
కంచెరపాలెం గ్రామ వాసులో ఈ చిత్రంలో వివిధ పాత్రల్లో కనిపించారు. ప్రతీ పాత్రా గుర్తుండిపోయేదే. రాజు, సుందరం, జోసెఫ్… ఇలా ప్రతీ పాత్రకూ ఈ సినిమాలో స్పేస్ ఉంది. తూకం వేసినట్టు, ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా నటించారు. నటించారు అనడం కంటే… ఆయా మనుషుల్నీ, జీవితాల్నీ ఆవిష్కరించారు అని చెప్పడమే బాగుంటుందేమో. అయితే.. మిగిలిన సహ పాత్రలు వృత్తి పరంగా నటులు కారు కాబట్టి.. చాలా చోట్ల సహజత్వం అనిపించినా… అక్కడక్కడ పట్టుబట్టి నటిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక వర్గం
ఓ దర్శకుడి తపనకు ఈ సినిమా నిదర్శనం. ఓ పల్లెటూర్లో నాలుగు నెలలు ప్రయాణం చేసి, అక్కడే కూర్చుని కథ రాసుకుని, అక్కడివాళ్లనే నటీనటులుగా తీసుకుని ఓ సినిమా చేయడం… నిజంగా ఓ గొప్ప ప్రయత్నం. వాస్తవిక కోణంలో చెప్పాలనుకున్న కథని.. ఆ గీత దాటకుండా చక్కగా ఆవిష్కరించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత సాధిస్తుంది? అనేది పక్కన పెడితే…. మన తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడం.. గొప్ప విషయమే అనుకోవాలి. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. కొన్ని బీజియమ్స్ వెంటాడుతుంటాయి. పాటలూ కథకు తగ్గట్టే ఉన్నాయి. మాటలు మరింత సహజంగా అనిపించాయి.
తీర్పు
కొత్త ప్రయత్నాలకెప్పుడూ ప్రోత్సాహం దక్కాలి. కొన్ని తప్పులున్నా… వాటిని మర్చిపోయి అభినందించాలి. లేదంటే అలాంటి ప్రయత్నాలు మళ్లీ మళ్లీ జరగవు. `కేరాఫ్ కంచెరపాలెం`కీ అలాంటి ప్రోత్సాహం కావాలి. తెలుగు చిత్రసీమలో ఓ మార్పు రావాలని కోరుకున్నవాళ్లందరికీ…. ఈ సినిమా ఓ బీజంలా కనిపిస్తుంది.
ఫైనల్ టచ్: కేరాఫ్…కొన్ని జీవితాలు
తెలుగు360 రేటింగ్: 3.25/5