వైసీపీలోని కోస్తా ప్రాంత ఎమ్మెల్యేలకు ఇదే సరైన సమయం. మూడు రాజధానుల పేరుతో మభ్య పెట్టి.. కోస్తా ఎమ్మెల్యేలతో కూడా .. కోస్తా ప్రాంతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ ఇప్పుడు… మొత్తం అమరావతి రైతుల్ని నట్టేట ముంచి… విశాఖ రాజధాని అంటున్నారు. అక్కడ ఇప్పటికే వనరులు కొల్ల గొట్టేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు తమ ప్రాంత ప్రయోజనాల కోసం కోస్తా ఎమ్మెల్యేలు నోరు విప్పాల్సిన సమయం వచ్చింది. లేకపోతే వారికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడం ఖాయమని అనుకోవచ్చు
గతంలోలా ఇప్పుడు సీఎం జగన్, వైసీపీ పరిస్థితి ఏకపక్షంగా లేదు. పరిస్థితి మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా రాజధాని విషయంలో ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా వ్యవహరించడానికి ముందుకు రాకపోతే.. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా వరకూ.. ఎమ్మెల్యేలు అమరావతి రాజధానికి మద్దతుగా రోడ్లపైకి వస్తే.. కోల్పోయిన ప్రజా మద్దతును కొంత వరకైనా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
అమరావతి రాజధానిగా ఏకపక్షంగా నిర్ణయించింది కాదు.. ఏకగ్రీవంగా నిర్ణయించింది. అలాంటప్పుడు ఇతర ప్రాంతాల ప్రజల్లో అమరావతి వ్యతిరేక భావన ఉంటుందని అనుకోవడం అపోహే. విశాఖలో రాజధాని సెంటిమెంట్ పెద్దగా లేదని తేలిపోయింది. విశాఖకు రాజధాని వెళ్తే.. ముఖ్యంగా నష్టపోయేది రాయలసీమ. రాజధాని దూరం అవుతుంది. అభివృద్ధికీ దూరమవుతుంది. వారు ఎలాగూ..తమ వాయిస్ రైజ్ చేస్తారు. కానీ సొంత ప్రాంత ప్రయోజనాలను జగన్ ప్రభుత్వం దారుణంగా తొక్కి పడేస్తున్నా నోరు విప్పనివారు కోస్తా ఎమ్మెల్యేలే.
ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా బయట పడుతున్న సమయంలో.. ప్రజాభీష్టానికి తగ్గట్లుగా తమ ప్రాంత ప్రయోజనాల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు.. . సొంత పార్టీపై ఉద్యమించకపోతే.. వారి రాజకీయ భ విష్యత్ అంధకారం అవుతందని రాజకీయంగా విశ్లేషించి చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. మరి వారేం చేయబోతున్నారు ?