తెలంగాణలో పెట్టే కొద్దీ పెట్టుబడులు పెట్టాలని మల్టీ నేషనల్ కంపెనీలు కోరుకుంటున్నాయి. తాజాగా కోకాకోలా కంపెనీ తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే కోకాకోలాకు తెలంగాణలో భారీ ప్లాంట్ ఉంది. ఇప్పుడు మరొకటి పెట్టాలని డిసైడయింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ కి తెలంగాణ ప్రభుత్వం 47.53 ఎకరాలు కేటాయించింది. కోకాకోలాతో తెలంగాణ పభుత్వం మూడు ఒప్పందాలు కుదుర్చుకుంది.
ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా సిద్దిపేట దగ్గర భారీ ప్లాంట్ పెట్టాలని కోకాకోలా నిర్ణయించడంతో ఆ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌కే పరిమితమయ్యే పరిశ్రమలు మెల్లగా జిల్లాలకు చేరుకుంటున్నాయి. ఐటీని ఇప్పటికే ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేలా చేయగలిగిన కేటీఆర్ ఇప్పుడు పరిశ్రమల్ని కూడా మెల్లగా సిద్ధిపేట వంటిప్రాంతాలకు వెళ్లేలా చేస్తున్నారు.
కోకాకోలా ప్లాంట్ పెట్టుబడితో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లభించనుంది. ఇక్కడ నుంచే్ పెద్ద ఎత్తున ఉత్పత్తులు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్‌తో పాటు ఉత్పాదక రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోంది.