చెన్నైలోని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థ చెన్నై వరద భాధితుల సహాయార్ధం ఏకంగా రూ.260 కోట్లు విరాళం ప్రకటించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో శాఖలు కలిగిన కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థకి అత్యధికంగా చెన్నైలోనే 60, 000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కనుక భారత్ లో అదే ప్రధాన కేంద్రంగా భావించవచ్చును. చెన్నై పరిస్థితి చూసి చలించిపోయిన ఆ సంస్థ యాజమాన్యం ఈ భారీ విరాళాన్ని నేడు ప్రకటించింది. అందులో రూ.65 కోట్లు నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తారు. మిగిలిన రూ. 195 కోట్లను సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్న వివిధ సంస్థలకు అందజేసి వాటి ద్వారా ఖర్చు చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ నుండి ఇంత భారీ విరాళం అందడం బహుశః ఇదే మొదటిసారి అని చెప్పవచ్చును. కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థను ఆదర్శంగా తీసుకొని రిలయన్స్ వంటి పెద్ద సంస్థలు కూడా స్పందిస్తే బాగుంటుంది.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తే, చెన్నైకి చెందిన సూపర్ స్టార్ రజనీ కాంత్ కేవలం రూ.10 లక్షలు మాత్రమే విరాళం ప్రకటించడం విశేషం. ఆయన నటించిన అనేక సినిమాలు వరుసగా విఫలం అవుతుండటంతో, ఆయన కొంతమంది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సొమ్ము వాపసు చేస్తున్నందున ఆర్ధిక సమస్యలో ఉండి ఉండవచ్చును. అందుకే అంత తక్కువ విరాళం ఇచ్చేరేమో? అల్లు అర్జున్, సురియా, కార్తి చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చేరు. హాన్సిక-15 లక్షలు, మహేష్ బాబు, విశాల్ చెరో 10 లక్షలు, రవితేజ, కళ్యాణ్ రామ్ చెరో 5 లక్షలు, వరుణ్ తేజ్-3 లక్షలు, సంపూర్ణేష్ బాబు-రూ.50, 000 విరాళాలు అందించేరు.