ఏదైనా యూనివర్శిటీకి వెళ్లి చట్టాలు చదువుకుని రా..!.. అని కోపం వస్తే.. తోటి ఐఏఎస్‌ను ఉద్దేశించి..మరో ఐఏఎస్ ఏవరైనా ప్రైవేటుగా వ్యాఖ్యలు చేస్తారేమో కానీ.. ఏకంగా జీవో జారీ చేస్తారా..? చేయరు. అలా చేశారంటే.. తట్టుకోలేనంత కోపం ఉందని అనుకోవాలి. ఇప్పుడు.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్న వాణీ మోహన్ విషయంలో సీఎస్ నీలం సహాని ఇలాంటి జీవోనే జారీ చేశారు. “ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి సీఆర్పీసీ నిబంధనలపై కచ్చితంగా ఒక రిఫ్రెషర్ కోర్సు చేయాలి. తద్వారా ఆమె తన పనితీరును, నైపుణ్యాన్ని పెంచుకోవాలి” అని జీవోలోనే చెప్పారు.
తెర వెనుక ఏం జరిగిందో కానీ.. తెర ముందు ముందు.. మాత్రం.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్న వాణీ మోహన్ గతంలో ఓ తప్పు చేశారు. అంతకు ముందు ఆమె సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొన్ని భూముల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆమె తప్పు చేశారు కానీ అవినీతికి పాల్పడలేదని నివేదిక ఇచ్చారు. అయితే ఆ ఆరోపణల్ని తిరస్కరించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి ఆధారంగానే ఆమెపై సీఎస్ నీలం సహాని.. ఘాటైన పదాలతో జీవో జారీ చేశారు. ఇలాంటి తప్పులకు సాధారణంగా మెమోలు జారీ చేస్తారు. కానీ సహానీ మాత్రం ఏకంగా ఘాటైన పదాలతో జీవోనే జారీ చేసేశారు.
జూనియర్ అయినప్పటికీ.. తోటి ఐఏఎస్ అధికారి పట్ల నీలం సహాని ఇలా వ్యవహరించడానికి కారణం… ప్రస్తుతం.. వాణీ మోహన్ బాధ్యతలు నిర్వహిస్తున్న పదవే కారణమని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో… ఎస్ఈసీకి… ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్ నిలం సహాని వివాదాస్పదం అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన జీవోలు వివాదాస్పదం అవుతున్నాయి. రాస్తున్న లేఖలు కోర్టు ఉల్లంఘనలన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో.. ఎన్నికల సంఘం వద్ద కార్యదర్శిగా ఉండి.. సీఎస్ సూచనలను పాటించడం లేదన్న కోపంతో.. ఇలాంటి జీవో జారీ చేశారన్న చర్చ… సెక్రటేరియట్లో నడుస్తోంది.