తెలంగాణ సీఎం కేసీఆర్ అభిమానం పొందితే చాలు అందలం ఎక్కిపోవచ్చు. కేసీఆర్ ఎప్పుడు కనిపించినా కాళ్లకు దండం పెట్టే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయిపోతున్నారు. మరో సంవత్సరంలో ముగిసిపోయే సర్వీసును త్యాగం చేసి ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని పొందుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత కేసీఆర్తో భేటీ కావడం కూడా జరిగిపోయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును కేసీఆర్ ఖరారు చేయబోతున్నారు.
గ్రూప్ వన్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం పొందిన వెంకట్రామిరెడ్డి అధికారంలో ఉన్న వారిని కాకాపట్టడంలో ఆరితేరిపోయారు. అలాగే ఐఏఎస్కూడా సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ను నమ్ముకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉండిపోయారు. కేసీఆర్ కూడా ఆయనను కదిలించలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన తీరు మారలేదు. ఆయనపై ఇతర పార్టీల నేతలకు పీకల మీద వరకు కోపంగా ఉంటుంది. కలెక్టర్గా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన ఉండాలి. అయితే ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఆయన నిర్ణయాలు ఉంటాయి. అందుకే ఆయనపై ఇతర పార్టీల నేతలకు పీకల మీద వరకూ కోపం ఉంటుంది.
ఆయన కుటుంబసభ్యులకు చెందిన రాజపుష్ప అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో బడా కంపెనీల్లో ఒకటి. మైహోంతో వ్యాపార భాగస్వామ్యాలు ఉంటాయి. ఇటీవల హైదరాబాద్ శివారులో వేలం వేసిన భూముల్లోనూ ఆ కంపెనీ భూములు దక్కించుకుంది. అందుకే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనను కేసీఆర్ బినామీగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి .. ఇక రాజకీయ విమర్శలు చేసుకుంటారేమో..?