కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తమ ముచ్చట్లతోనే ముచ్చెమటలు పట్టించిన బెంగళూరు కాలేజీ అమ్మాయిలు అక్కడితో ఆగడంలేదు. రాహుల్ ని తామెందుకు విభేదించామో మొహమాటం లేకుండా బహిరంగలేఖల ద్వారా ఎడాపెడా వాయించేస్తున్నారు.
రాహుల్ గాంధీ ఈమధ్య బెంగళూరులోని మౌంట్ కర్మెల్ కాలేజీ అమ్మాయిలతో పిచ్చాపాటిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆ సందర్బంగా రాహుల్ తో కొన్ని విషయాల్లో విద్యార్థినులు ఏకీభవించలేదు. కార్యక్రమం అయిపోయినతర్వాత కూడా చిరచిర్లాడుతూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారిలో కొంతమంది రాహుల్ కు బహిరంగలేఖలు రాశారు. `సారూ.. మీ అభిప్రాయాలు మామీద రుద్దవద్ద’ని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాల్లో ఈ బహిరంగలేఖలు హల్ చల్ చేస్తున్నాయి.
రాహుల్ కి ఎదురుతిరిగిన ఈ పిచ్చాపాటి ముచ్చట్ల వ్యవహారాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక కర్నాటక కాంగ్రెస్ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. తామంతా పాజిటీవ్ గానే తీసుకున్నామని చెప్పే ప్రయత్నాలు మొదలెట్టారు. నిజానికి నిర్మహమోటంగా సాగే మాటామంతీ కార్యక్రమాలవల్లనే మేలు జరుగుతుందని చెబుతున్నారు. నాయకులు చెప్పిన విషయాల్లో కొన్ని నచ్చవచ్చు, లేదా మరికొన్ని నచ్చకపోవచ్చు. ఈ కోణంలో చూసినప్పుడు ఈ కార్యక్రమాన్ని రాహుల్ పాజిటీవ్ గానే తీసుకున్నారనీ, దీనిపై రభస అనవసరమని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుజెవాలా కవర్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ కాలేజీకి చెందిన ఎలిక్సర్ నహర్, అలాగే మాధురీ అనే అమ్మాయి ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రాహుల్ కు బహిరంగ లేఖలు రాసిపారేశారు. ఇప్పుడవి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ బహిరంగ లేఖల్లో వారు తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లు చెప్పేశారు. మాధురీ రాసిన లేఖలోని కొన్ని పాయింట్లు ఇవి…
1. అయ్యా రాహుల్ గారూ, మీరు చెప్పిన సంగతుల్లో కొన్ని బాగా నచ్చాయి. వాటికి మేము తప్పట్లు కొట్టాం. కొన్ని నచ్చలేదు. `నో’ అన్నాం. మీరు చెప్పిన ప్రతిదానికీ …. ఎస్, ఒకే…అనాలంటే కుదరదు. ఎందుకంటే మేము స్వతంత్రంగా ఆలోచిస్తాము. పైగా మేము మీ పార్టీ డబ్బులిచ్చి పెట్టుకునే ఏజెంట్స్ కాముగా..
2. మీరు చెప్పే ప్రతిదానికీ గంగిరెద్దులా తలఊపుతామని మీరు అనుకుంటే అది మీ పొరబాటు. మాది కానేకాదు.
3. స్వచ్ఛ్ భారత్ సరిగా పనిచేయడంలేదని మీరు అన్నారు. ఒకవేళ అది వైఫల్యం పొందిందనే అనుకుందాం, అప్పుడది దేశప్రజల వైఫల్యమే అవుతుంది తప్ప, ప్రధాని మోదీ వైఫల్యం ఎలా అవుతుంది? అందరూ తలాఒక చెయ్యి వేస్తేనే స్వచ్ఛ్ భారత్ విజయవంతం అవుతుంది.
4. మేక్ ఇన్ ఇండియా బిగ్ ప్లాప్ అన్నారు మీరు. దీనిపై మేము మిమ్మల్ని ప్రశ్నిద్దామనుకుంటున్నాము. మేక్ ఇన్ ఇండియా కోసం మేరేం చేశారు సార్? అది చెప్పండి…??
5. దేశాభివృద్ధికి సంబంధించిన కీలక బిల్లలు పార్లమెంట్ లో ఆమోదం పొందకపోతే `మేక్ ఇని ఇండియా’ ఎలా సాధ్యమవుతుందనుకుంటున్నారు. బిల్లులకు ఏదో ఒక వివాదంతో సభలో అడ్డుతగులుతున్నది మీరేకదా… అంటే మీ పని మీరు సవ్యంగా చేయకుండా మేక్ ఇన్ ఇండియాపై విమర్శిస్తున్నారన్నమాట. ముందు, మీ పాత్రఏమిటో గుర్తించండి. మీ ఇగోలను పక్కనబెట్టి దేశాభివృద్ధిపై దృష్టిపెట్టండి.
6. బాలికల సమగ్రాభివృద్ధికోసం చేపట్టిన `బేటీ బచావో, బేటీ పడావో’ వంటి కార్యక్రమాల గురించి పాజిటీవ్ గా మీరెప్పడైనా మాట్లాడారా ? మేము ఎక్కడా చదవలేదు, ఎక్కడైనా మాట్లాడితే చెప్పండి…
7. మోదీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని అంటారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఒక్కటి కూడా మీకు కనిపించవా ? ఎంతసేపటికీ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మోదీ సూట్ మీద వివాదంరేపారు. అది అవసరమా?
8. అలా అని మేము బిజెపీ వాళ్లం కాదు. మేము విద్యార్థులం. రాజకీయాలపట్ల అవగాహన ఉన్న విద్యార్థులం. అందుకే నిజం నిక్కచ్చిగా చెబుతున్నాము.
9. దేశపునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రవర్తించాలి. అర్థవంతమైన ఆలోచనలతో ముందుకుసాగాలి. సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి.
10. ప్రభుత్వం అంతా మంచి చేస్తున్నదని చెప్పడంలేదు. ఎక్కడ చెడు ఉన్నా ఎండగడదాం. మొన్నటి పిచ్చాపాటి కార్యక్రమంలో మా వైఖరి మీకు కోపం తెప్పించి ఉండవచ్చు. మాకేదో అవగాహన కలిగించాల్సిన అవసరం మీ పార్టికిలేదు. మాకు చక్కటి అవగాహన ఉంది. అది అత్యంత సానుకూలంగా ఉంది. దయచేసి గమనించండి.
సామాజిక మీడియోల్లో వస్తున్న ఈ తరహా లేఖలకు రాహుల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.
– కణ్వస