విజయవాడ లోనే ఒక ప్రైవేట్ మహిళా కళాశాల అధ్యాపకులు తమ బ్యాంక్ అకౌంట్ లలో అకస్మాత్తుగా భారీ మొత్తలు జమకావటం, వాటిల్లో తిరిగి కొంత ఆమొత్తం డ్రా చేసుకోవడం జరిగిన్నట్లు యస్ యం యస్ లు రావడంతో విస్మయం చెందారు. కళాశాల యాజమాన్యమే తమ వద్ద నల్ల ధనంగా ఉండిపోయిన రద్దయిన పాత నోట్లను మార్చుకోవడం కోసం ఈ విధంగా చేశారనే అనుమానాలు చెలరేగాయి.
దానితో పోలీస్ లు రంగప్రవేశం చేయడం, కళాశాల కరెస్పాండంట్ కాంతారావు పై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విధంగా వారి బ్యాంక్ అకౌంట్ లలో రు 12 లక్షల వరకు డిపాజిట్లు వేయగా, అందులో సగం వరకు డ్రా చేసుకున్నారు.
ఇది యధాలాపంగా జరిగిన ఒకే సంఘటన కాదని, రెండు తెలుగు రాస్త్రాలలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో, ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలల్లో ఇదే విధంగా జరుగుతున్నదని తెలుస్తున్నది. నారాయణ, శ్రీ చైతన్య, విజ్ఞాన్ వంటి కార్పొరేట్ కళాశాలలతో పాటు అనేక ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలల్లో సిబ్బందికి ఆన్ లైన్ లో బ్యాంక్ బదిలీతో కాకుండా పాత నోట్లతోనే జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది.
సాధారణంగా ఇటువంటి కళాశాలలు ప్రతి నెల రెండో వారంలో జీతాలు ఇస్తూ ఉండటం ఆనవాయితీ కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించిన తరువాతనే అక్టోబర్ నెల జీతాలను చెల్లించారు. నవంబర్ నెల జీతాలను సహితం పాత నోట్లతోనే చెల్లిస్తామని తెలిపారు. పైగా వారికీ ఇవ్వ వలసిన బకాయిలు, బోనస్ లను సహితం ఇప్పుడే పాత నోట్లతో చెల్లిస్తున్నారు. అడ్వాన్స్ లు కావాలన్న తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు.
చెల్లించవలసిన మొత్తాలను పాత నోట్లతో చెల్లించడమే కాకుండా తమ వద్ద ఉన్న కొన్ని పాత నోట్లు ఇచ్చి, వాటిని తమ బ్యాంక్ అకౌంట్ ల ద్వారా మార్చి కొత్త నోట్లను తీసుకు వచ్చి ఇవ్వమని పలువురు యాజమాన్య ప్రతినిధులు వత్తిడి కూడా చేస్తున్నారు.
ఆ విధంగా వారి నల్ల ధనాన్ని వైట్ చేయడం కోసం సహకరించడానికి నిరాకరించిన తనకు నామమాత్రంగా ఇంక్రిమెంట్ ఇచ్చారని, అందుకు సహకరించిన మిగిలిన వారికి మాత్రం తనకన్నా రెండు, మూడు రేట్ల ఎక్కువ మొత్తం ఇంక్రిమెంట్ లుగా ఇచ్చారని ఒక కార్పొరేట్ కళాశాలలో ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్న ఒకామె చేప్పారు.